ఓట్లు పోయెనండీ నారాయణా!
posted on Nov 11, 2015 2:31PM

గ్రేటర్ హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లను తొలగించారని, తద్వారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయం సాధించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై అధికార పార్టీ మీద పోరాటం చేస్తున్నాయి. వారి పోరాటం ఫలించి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి ఈ అంశం మీద కూలంకషంగా విచారణ చేస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు తోడు ఓటర్లకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఓట్లు తొలగించారని, ఓట్లు తొలగించాల్సిన అవసరం లేనివారి ఓట్లు కూడా తొలగించారనేదానికి కొన్ని ఆధారాలు లభిస్తున్న నేపథ్యంలో ఈ అంశం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ తలనొప్పి చాలదన్నట్టు ప్రభుత్వానికి మరో సమస్య కూడా వచ్చిపడింది. సీపీఐ నాయకుడు నారాయణ, ఆయన భార్య ఓట్లను తొలగించారు. ఈ ఒక్క అంశం చాలు వామపక్షాలు మరింత చెలరేగిపోవడానికి.
హైదరాబాద్‌లోని హైదర్‌గూడా ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సీపీఐ నాయకుడు డాక్టర్ నారాయణ, ఆయన భార్య వసుమతిదేవి ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఈమధ్యే ఓ ఫైన్ మార్నింగ్ వాళ్ళిద్దరి ఓట్లను తొలగించినట్టు వారికి సమాచారం అందింది. దాంతో నారాయణ అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ప్రభుత్వం సీమాంధ్రుల ఓట్లను ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తోందని అనడానికి ఇంతకంటే బలమైన నిదర్శనం ఇంకేమి కావాలని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి ప్రతిస్పందన లభించలేదు. కానీ, ఈ విషయాన్ని నారాయణ అంత ఈజీగా వదిలిపెడతారని రాజకీయ పరిశీలకులు భావించడం లేదు. వామపక్ష పార్టీలన్నిటి సహకారంతో ఈ అంశాన్ని మరింత రచ్చచేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం వుందని అంటున్నారు.