కర్నాటకలో నిప్పు పెట్టిన టిప్పు
posted on Nov 11, 2015 8:15PM

కర్నాటకలో టిప్పు సుల్తాన్ నిప్పు రగిల్చాడు. ఎప్పుడో మైసూరు సంస్థానాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాన్ అప్పట్లో హిందువులను హింసించాడని కొంతమంది అంటారు. కొంతమంది అయితే టిప్పు సుల్తాన్ హిందువుల విషయంలో ఎలాంటి హింసకూ పాల్పడలేదని చెబుతూ వుంటారు. టిప్పు సుల్తాన్ హిందువు కాకపోవడం వల్లే ఆయన్ని విమర్శిస్తూ వుంటారన్న కామెంట్లూ వున్నాయి. ఏది ఏమైనప్పటికీ టిప్పు సుల్తాన్ హిస్టరీ ఒక మిస్టరీ. ఆ మిస్టరీ తేనె తుట్టెను కదిలించడం కంటే ఊరక వుండటం మేలన్ అభిప్రాయాలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో టిప్పు కారణంగా కర్నాటకలో నిప్పు రగిలింది. అది కూడా మామూలు నిప్పు కాదు రాజకీయ నాయకులు రగిల్చిన నిప్పు.
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అర్జెంటుగా టిప్పు సుల్తాన్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వెంటనే టిప్పు సుల్తాన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని సంకల్పించాడు. టిప్పు సుల్తాన్‌ను కీర్తించడం ద్వారా ముస్లింలకు దగ్గర కావాలనేది ఆయన ఆంతర్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సరే, సిద్ధరామయ్య రాజకీయం కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. మన బీజేపీ నాయకులు పోనీలే అని ఊరుకోవచ్చు కదా... టిప్పు సుల్తాన్ పుట్టిన రోజు వేడుకలు జరపరాదంటూ వ్యతిరేకించడం ప్రారంభించారు. పుట్టినరోజైన మంగళవారం నాడు కర్నాటకలో నానా హడావిడి చేశారు.. ఫలితంగా జరిగిన గొడవల్లో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు బీజేపీ నాయకుడు మరొకరు సాధారణ పౌరుడు. ఇప్పుడు ఈ గొడవతో కర్నాటక అట్టుడుకుతోంది. చివరికి టిప్పు సుల్తాన్ గారు కర్నాటక రాష్ట్రాన్ని ఏం చేస్తారో చూడాలి.