మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రిమాండ్ పొడిగించిన కోర్ట్...
posted on Sep 25, 2019 3:33PM

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జైల్లో ఉన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు రిమాండ్ కోర్టు పొడిగించింది. ఈ రోజు విచారణ సందర్భంగా ఆయనను ఏలూరు లోని ఎస్సీ ఎస్టీ కోర్టు లో పోలీసులు హాజరుపరిచారు. దీంతో వచ్చే నెల తొమ్మిది వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. రెండు వేల పదిహేడు లో ఒక స్థలం వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన ఘటనలో చింతమనేనిపై కేసు నమోదైంది.
అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా జరిగింది. అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు చింతమనేని ప్రభాకర్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు చింతమనేని ప్రభాకర్ పై అరవై ఆరు కేసులు నమోదు కాగా అందులో రెండు వేల పదిహేడు సంవత్సరంలో పెదపాడు మండలంలోని అప్పలవీడు గ్రామం లో వ్యక్తిని నిర్భందించి, దూషించినటువంటి కేసులో ఈ నెల పదకొండున పధ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
అలాగే చింతమనేనిని అరెస్టు చెయ్యడానికి వెళ్లిన సమయంలో కొంత మంది మహిళా కానిస్టేబుళ్లని నిర్బంధించారనేటువంటి మరో కేసులో అక్టోబర్ ఒకటో తేదీ వరకు రిమాండ్ కొనసాగుతోంది, మళ్లీ ఒకటో తేదీన చింతమనేని ప్రభాకర్ ని కోర్టులో హాజరుపరుస్తారు. ఆ కేసులో కూడా రిమాండ్ పొడిగిస్తారనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.