లింగమనేనికి కౌంటర్ ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే రామ కృష్ణారెడ్డి...
posted on Sep 25, 2019 2:52PM

మాజీ ముఖ్య మంత్రి నివాసముంటున్న కరకట్ట మీద తన ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు లింగమనేని రమేష్. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు, కరకట్ట మీద ఉన్న తమ ఇంటిని కూల్చివేస్తారు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బాధ్యత గల పౌరుడి గానే తన ఇంటిని చంద్రబాబుకి ఇచ్చానన్నారు. ఉండవల్లి పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని నిబంధనల మేరకే ఆ ఇంటి నిర్మాణం జరిగిందని లేఖలో పేర్కొన్నారు.
ఈ అంశంపై స్పందించిన వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి లింగమనేనికి కౌంటర్ ఇచ్చారు. ఆర్ కే మాట్లాడుతూ, గతంలో చంద్రబాబునాయుడి గారి హయాంలో జలవనరులశాఖ మంత్రి తాడేపల్లి నదీ పరీవాహక ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడ చూసినవి అక్రమ నిర్మాణాలని వాటన్నిటినీ రాబోయే రోజుల్లో కూల్చి వేస్తామని చెప్పిన మాట మర్చిపోయారా రమేష్ గారు అని ఆర్.కె ప్రశ్నించారు.
అదే విధంగా అప్పటి తాడేపల్లి తహసిల్దార్ గారు అక్కడ ఉన్నటువంటి గృహాలన్నిటికీ అవన్నీ అక్రమ నిర్మాణాలని నోటీసులివ్వటం వాస్తవం కాదా అని అన్నారు. అప్పుడు స్పందించని మీరు పైగా ఆ గృహం నాది కాదు ప్రభుత్వానిది అన్న మీరు ఇప్పుడు నా గృహం కూల్చేస్తున్నారు, నాకు గుండె కోత జరుగుతుంది అనటంలో ఆంతర్యం ఏంటని లింగమనేనిని వైసిపి ఎమ్మెల్యే ఆర్.కె అన్నారు.