ఆ అధికారి బదిలీ కి సీఎం ఆగ్రహమే కారణం !!
posted on Sep 25, 2019 3:39PM

నీతి, నిజాయితీ గా పని చేసే అధికారులకు పట్టం కట్టే ప్రభుత్వాలు కరువౌతున్నాయా.. ఆంటే ఔననే సమాధానం వస్తోంది. హర్యానాలో అశోక్ ఖేమకా అనే సిన్సియర్ ఐఏఎస్ అధికారి ని ఇప్పటివరకు 52 సార్లు బదిలీ చేసారు. కారణం అయన నీతి నిజాయితితో పని చేయడం. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా బీజేపీ ప్రభుత్వం కావచ్చు. కానీ బదిలీ మాత్రం పక్కా.. తాజాగా కర్ణాటకలో ఆ రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై బదిలీ వేటు పడింది. ప్రస్తుతం కర్నాటక భవన నిర్మాణ సంక్షేమ శాఖ నుంచి ఆమెను సెరికల్చర్ డెవలప్మెంట్ కమిషనర్ గా బదిలీ చేస్తూ యడియూరప్ప ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్న సింధూరిపై బదిలీ వేటు పడటం వరుసగా ఇది నాలుగో సారి. ఇక్కడ కూడా బదిలీకి కారణం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని నిజాయితీనే. కర్నాటకలో ఆమెను ‘లేడీ సింగం’ అని కూడా పిలుస్తారు.
కర్నాటకలో తాజాగా వచ్చిన వరదల నేపథ్యంలో రూ.1000 కోట్ల భవన నిర్మాణ సంక్షేమ శాఖ నిధులను విపత్తు సహాయ నిధికి మళ్లించాలని కర్నాటకలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం రోహిణి సింధూరిని కోరినట్లుగా తెలుస్తోంది. ఐతే అందుకు ఆమె నిరాకరించడంతో యడియూరప్పకు ఆగ్రహం తెప్పించినట్లు అందుకే ఈ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.