ముగిసిన డెడ్ లైన్.. పట్టించుకోని కాంగ్రెస్.. పాపం షర్మిల!

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు అప్పగిస్తారా? లేక షర్మిల కోరినట్లుగానే ఆమె భవిష్యత్ రాజకీయ ప్రయాణం తెలంగాణలో సాగుతుందా? షర్మిల తెలంగాణలోనే ఉంటే ఆమెను అసెంబ్లీ బరిలో దింపుతారా? లేక రాజ్యసభకు పంపిస్తారా? ఇదీ నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో హాట్ హాట్ గా నడిచిన వ్యవహారం. కాంగ్రెస్ హై కమాండ్   షర్మిలతో సంప్రదింపులు చేసిందనీ.. వైఎస్సార్టీపీ విలీనానికి ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కర్ణాటక నుండి డీకే శివకుమార్, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలిసిన షర్మిల తన మనసులో ఉన్నదేంటో చెప్పగా.. అందుకు కాంగ్రెస్ కూడా ఒకే చెప్పేసిందని, సోనియా, రాహుల్ తెలంగాణకు రాగానే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానిస్తారని విపరీతమైన ప్రచారం సాగింది. సోనియా వచ్చారు.. వెళ్లారు. కానీ, షర్మిల ఊసేలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కూడా షర్మిల టాపిక్కే లేకుండాపోయింది. ఇంతన్నాడే అంతన్నాడే గంగరాజు చివరికి నట్టేట ముంచేశాడే గంగరాజు అన్న చందంగా చివరికి షర్మిలను  కాంగ్రెస్ పట్టించుకోకుండా వదిలేసింది.  

సోదరుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న షర్మిలకు తొలినాళ్లలోనే ఆమె సొంత పార్టీ భవిష్యత్తుపై స్పష్టత వచ్చేసి ఉంటుంది. కానీ, ఏ మాత్రం బెరుకు లేకుండా తానే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నా.. వాస్తవానికి వచ్చేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. చివరికి షర్మిల తప్ప చెప్పుకొనే పేరున్న ఒక్క లీడరు లేకుండా షర్మిల పార్టీలో లేకుండా పోయారు. ఆఖ‌రికి ఆమె పార్టీ భవిష్యత్తు ఏంటో ఎటూ తేల‌కపోవ‌డంతో కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. అనుకున్నదే తడవుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు   హైకమాండ్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండి వ్యతిరేకత వస్తున్నా.. తనదంతా ఢిల్లీ స్థాయి అన్నట్లే షర్మిల వ్యవహారం నడిచింది. అందుకు తగ్గట్లే ఢిల్లీ హైకమాండ్ నుండి కూడా సానుకూల స్పందన రావడంతో రేపో మాపో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అనే ఊహాగానాలు తెగ చక్కర్లు కొట్టాయి. కానీ, అవేమీ నిజం కాలేదు.

 ముందుగా అనుకూలంగానే కనిపించిన కాంగ్రెస్ అధిష్టానం చివరికి షర్మిలను పట్టించుకోవడమే మానేసింది. మధ్యవర్తిత్వం చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా రేపు మాపు అన్నట్లు షర్మిల వ్యవహారాన్ని సాగదీశారు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే అసలు షర్మిలను పట్టించుకొనే పట్టించుకోలేదు. కొందరైతే ఆమెను వెళ్లి ఏపీలో రాజకీయం చేసుకోమని కూడా సలహాలిచ్చారు. ఇక ఇలా అయ్యే పని కాదని ఇటీవల షర్మిల నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని  కలిసి తన మనసులో మాట చెప్పుకొచ్చారు. ఈ భేటీతో షర్మిల పార్టీ విలీనం కన్ఫర్మ్ అయినట్లే అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు స్పష్టత లేదు. చివరికి షర్మిల త‌న విలీనం గురించి కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ కూడా విధించారు.ఆమె  కాంగ్రెస్‌కు పెట్టిన డెడ్ లైన్ శనివారం (సెప్టెంబర్ 30)తో ముగిసిపోయింది కూడా. అయినా హస్తం పార్టీ అసలా డెడ్ లైన్ ను ఖాతరు చేసినట్లు కానీ, కనీసం కన్సిడర్ చేసినట్లు కానీ లేదు.  

అయితే కాంగ్రెస్ షర్మిలను పట్టించుకోవడం వెనక పలు కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేయడం  చాలామంది కాంగ్రెస్ నేతలకు ఇష్టంలేదు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టీ విక్రమార్క, కోమటిరెడ్డి, వీహెచ్ లాంటి వాళ్ళకు షర్మిల వలన ప్రయోజనం లేదని అధిష్ఠానానికి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. వైఎస్ఆర్ కుమార్తెగా తెలంగాణలో ఆమె వల్ల కలిగే లాభం ఏమీ లేకపోగా.. ఆంధ్రా నాయకురాలన్న ముద్రతో జరిగే నష్టమే ఎక్కువని వివరించారు. పైగా ఇప్పుడు పార్టీలో ఎటు చూసినా సీనియర్ నేతలే చేరిపోయారు. టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ లెగసీతో షర్మిలను తీసుకొచ్చి ఆమెకి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ రాష్ట్ర నేతల అభిప్రాయంతో హైకమాండ్ కూడా ఏకీభవించిందంటున్నారు. పైపెచ్చు షర్మిల కోరిక మేరకు ఖమ్మం జిల్లా పాలేరు సీటు ఆమెకి కేటాయించే పరిస్థితి అసలు లేదు. అందుకే రాష్ట్ర నేతలు ఆమె రాకను స్వాగతించలేదు. దీంతో  హైకమాండ్ షర్మిలను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు రాజకీయవర్గాలలో ఇప్పుడు పాపం షర్మిల అన్న మాటే వినిపిస్తున్నది.