జనం నిర్దేశించిన పొత్తు.. ఇక జగన్ చిత్తు!

ఏపీ రాజకీయముఖ చిత్రం మారిపోయింది. విపక్ష నేతను జైల్లో పెట్టి.. రాష్ట్రం మొత్తాన్ని జైలుగా మార్చేసి వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలన్న జగన్ రెడ్డి ఎత్తుగడ చిత్తైనట్లే కనిపిస్తోంది. ఇంత కాలం ఉంటుందా? ఉండదా అన్న ఊగిసలాటలో ఉన్న తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు విషయంలో లుకలుకలు, అసమ్మతి గళాలు, ఆగ్రహజ్వాలలకు తావనేదే లేకుండా అసలా విషయాన్నే పెద్దగా ప్రస్తావించకుండా ఇరు పార్టీలూ పైనుంచి క్షేత్రస్థాయి వరకూ జగన్ రెడ్డి ఉన్మాన పాలనను, నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ ఏకతాటిపైకి వచ్చేశారు.

ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు రాజకీయ సమీకరణాల కోసం కాకుండా.. ప్రజాభీష్టం మేరకు ఏర్పడిందని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని, పోలీసు వ్యవస్థను విపక్షాలను వేధించే ఒక టూల్ గా మార్చేసి గత నాలుగేళ్లుగా జగన్ ఆడుతున్న వికృత క్రీడకు చరమగీతం పాడటమే లక్ష్యంగా జనం తెలుగుదేశం, జనసేనలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. గత రెండేళ్లుగా పొత్తల విషయంలో ఇరు పార్టీల మధ్యే కాకుండా, జనబాహుల్యంలోనూ చర్చ జరుగుతున్నప్పటీ ఆ చర్చలకు ముగింపు మాత్రం జనాభీష్టం మేరకే జరిగింది. జగన్ ను గద్దెదింపడమే లక్ష్యంగా ఇరు పార్టీలూ కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న ప్రజాభిప్రాయమే.. ఇరు పార్టీల నిర్ణయాన్నీ ప్రభావితం పచేసింది. 

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను, పురోగతిని నిలువునా పాతేసిన జగన్ కు బుద్ధి చెప్పాలి, యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఉరివేసిన జగన్ ను అధికారం నుంచి దించాలని జనం ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారు. ఆ నిర్ణయం ఫలితమే తెలుగుదేశం, జనసేనల పొత్తుగా ప్రతిఫలించింది. జగన్ పాలనలో రాష్ట్ర ప్రగతి కుంటుపడింది. యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సర్కార్ అడ్డగోలుగా చేస్తున్న అప్పులు జనాలకు గుదిబండగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలన రాష్ట్రం పాలిట మహమ్మారిగా మారింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కరోనా కారణంగా జరిగిన నష్టం కంటే కొన్ని రెట్లు ఎక్కువ నష్టం జగన్ పాలన కారణంగా జరిగింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్నట్లే.. జగన్ అనే మహమ్మారిని తరిమికొట్టడానికి జనం కనుగొన్న వ్యాక్సినే తెలుగుదేశం, జనసేన పొత్తు.

ఇదే విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ తన నాలుగో విడత వారాహియాత్రలో భాగంగా అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెప్పారు. వచ్చే ఎన్నికలు కురుక్షేత్రమేనని, జగన్ రెడ్డి సేన కౌరవులైతే.. తెలుగుదేశం, జనసేన పాండవులని ఉద్ఘాటించారు. జగన్ పాలనలో ఉద్యోగాలు లేవు. విపక్ష నేతగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాట తప్పారు. మెగా డిఎస్సీ అంటూ మడమతిప్పారు.  విపక్ష నేతగా చేసిన  పాదయాత్రలో జగన్ ఇవ్వని హామీలు లేవు..అరిచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చిన తరువాత జనాలకు నరకం చూపించారు. జనం అన్నీ గమనించారు. అందుకే చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత  ఒక్కసారిగా పెల్లుబికిన జనాగ్రహమే పవన్ కల్యాణ్ చేత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్దనే పొత్తును ప్రకటించేలా చేసింది. తాజాగా వారాహి నాలుగో విడత యాత్ర తొలి రోజు అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలోనూ అదే చెప్పారు. వచ్చే ఏన్నికల్లో జగన్ రెడ్డి పార్టీకి  15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. జగన్ అధికారమదాన్ని ఎలా అణచాలో తమకే కాదు, జనానికీ తెలుసునని ఉద్ఘాటించారు.  

ప్రజాసమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చాలా కాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుతమ్ముళ్లు, జనసైనికులు ఉమ్మడి పోరాటాలు చేస్తున్నా.. యువగళం పాదయాత్రలో జనసేన జెండాలు రెపరెపలాడినా, ఆ రెండు పార్టీల ఐక్యత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చేసిందన్నది అవనిగడ్డ సభలో ప్రస్ఫుటంగా కనిపించింది. తెలుగుతమ్ముళ్లు, జనసైనికులు, ఇరు పార్టీల నేతల కలయికతో అవనిగడ్డ జనసంద్రాన్ని తలపించింది.