ఇసుక రవాణాతో ఏపీ ప్రభుత్వంలో సరికొత్త ఉద్యోగ అవకాశాలు అందించనున్న సీఎం జగన్...

 

గత ప్రభుత్వం ఇసుక విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇసుక విధానం ప్రజలకు మద్దత్తు ఉండేలా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇసుక పంపిణీ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ప్రతి జిల్లాలోని రెండు వేల మంది నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులు ఆయా కార్పొరేషన్ ల ద్వారా ఇసుక రవాణా వాహనాలను ఇప్పించి వారికి ఇసుక కాంట్రాక్టు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారని సమాచారం. దీని పై త్వరలో మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏపిలో తీవ్ర చర్చలు జరిపిన తరువాత ఇసుక అమ్మకాలు ప్రారంభించిన జగన్ సర్కారు దీన్ని పటిష్టంగా అమలు చేసేలా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తోంది. దీంతో పాటు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా సీఎం జగన్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇక పై ప్రతి జిల్లాలో రెండు వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగుల యువకులను గుర్తించి వీరికి కాపు కార్పొరేషన్ తో పాటు సంబంధిత కార్పొరేషన్ ద్వారా ఇసుక రవాణా వాహనాలు అందించనున్నారు. వీరికే ఇసుక రవాణ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ఇసుక రవాణాలో అక్రమాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను రూపొందించాలని సూచించారు. 

ఇసుక అమ్మకాలు ప్రారంభమైన ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల ఇసుక పంపిణీలో ఆటంకాలు ఏర్పడటం పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటరుకు నాలుగు రూపాయల తొంభై పైసలు చొప్పున ఇసుక రవాణా చేస్తామంటూ ఎవరు ముందుకొచ్చినా వారికి అవకాశం ఇవ్వాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రీచ్ లను తెరవాలని జిల్లాలో ఇసుక సరఫరా రవాణా బాధ్యతను జేసీ స్థాయి అధికారికి అప్పగించారని సూచించారు. ఆ ఆధికారి కేవలం ఇసుక సరఫరా రవాణాలను మాత్రమే చూడాలన్నారు. కృష్ణా, గోదావరి నదిలో వరదలు తగ్గాయి కాబట్టి ఇసుక లభ్యత ఉందని దానిని తక్కువ రేటుకు అందించారని సీఎం చెప్పారు. వచ్చే అరవై రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ రాజకీయ జోక్యాన్ని ఎక్కడ అనుమతించరాదని సీఎం ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కచ్చితంగా కనిపించాలని ఆయన వెల్లడించారు. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితిల్లోనూ కనిపించకూడదని,ప్రోత్సహించకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని వెల్లడించారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదని ఈ మేరకు చెక్ పోస్టుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో అవసరానికి తగిన ఇసుక లేదన్న విషయం గుర్తించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ అంశంపై జగన్ తనదైన గట్టి నిర్ణయాన్ని తెలియజేశారు.