ట్రిపుల్ ఐటీ సరే... మరి విద్యలో నాణ్యత!
posted on Oct 1, 2012 9:35AM
చిత్తూరుజిల్లా సరిహద్దు.. చెన్నై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోఉన్న సత్యవేడు వద్ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ని 50 నుండి 100 ఎకరాల విస్తీర్ణంలో...128 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేయబోతున్నారట. ఐటీరంగానికి బాసటగా వుండేలా ఉత్తమ ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందించడం ఈ సంస్థ ప్రధానోద్దేశం. దేశవ్యాప్తంగా 20 ట్రిపుల్ ఐటీలను స్థాపించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో ఒక్కొక్క దానికి 128 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం 50 శాతంనిధులను, 35శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 15శాతం నిధులు పబ్లిక్ లేదా ప్రైవేటురంగసంస్థలు భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం కేటాయించాలి. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. దేశానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి మరింత ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యం అభినందనీయం. అయితే ఇప్పటికే ఐటీరంగానికి సేవలందిస్తున్న పలు సంస్థల్లో నాణ్యమైన విద్య లభించడం లేదని, దానికి తోడు విద్యార్థులపై ఆర్థికభారం కూడా ఎక్కువగా ఉందని వాపోతున్నారు ఎంతోమంది విద్యార్ధులు. ఐటీ రంగానికి ఉపయోగపడే దిగువస్థాయిలో చదువుకుంటున్న యువతకు నాణ్యమైన చదువును, ఆర్థికంగా వెనుకబడిన తెలివైన విద్యార్ధులకు ఆర్థిక వెసులుబాటుకు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ ట్రిపుట్ ఐటీలు ప్రారంభమయ్యేనాటికి భారతదేశానికి కావలసిన అసలైన ఐటీ నిపుణులు తయారవుతారు. ముందు అది ఆలోచించాలని... నాసిరకం విద్యతో నాణ్యమైన పనులు చేయలేరని ఎంతోమంది విద్యార్దుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.