మేమింతే...!
posted on Oct 1, 2012 9:32AM
వడ్డించేవాడు మనవాడు అయితే పంక్తిలో చివర్లో కూర్చున్నా వస్తుందన్న మాట నేటి కాలంలో ముమ్మాటికి ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా రాజకీయనేతల అండదండలున్న పెద్దలకు అటువంటిది మంచినీళ్ళు త్రాగినంత పని. రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతు ప్రతినిధులకు సైతం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలిలో పదవులను ప్రాతినిధ్యం కల్పించాలని ప్రత్యేక చట్టం చెబుతోంది. పాలకమండలిలో నలుగురు ఆదర్శరైతులుండాలన్నది నిబంధన. మరి ఈ నిబంధనలు ఎంతవరకు అమలుజరుగుతున్నాయో పాలకులకే తెలియాలి. ఆదర్శం కోటా పేరుతో తిరుపతి పట్టణానికి చెందిన బి. మమత అనే మహిళను ఎంపికచేశారు. ఈమెకు భూములున్నా వ్యవసాయం చేయడంలేదు. అంతేకాదు ఓ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఈమె. అలాగే ఎంపికైన మరో ఇద్దరు కూడా భూములున్నా వ్యవసాయం చేయడం లేదు. ఇలా ఏమిలేకుండానే ఉన్నాయని అందలం ఎక్కిస్తే ఎవరికి ప్రయోజనం! ఇప్పటికే దేశంలో, అందునా రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి దయనీయంగా వుంది. ఎంతోమంది ఉన్నతులు అధిరోహించిన స్థానాలను కొందరు తమ అవసరాలకోసం పదవుల పందేరా చేయడం ఎంతవరకు సమంజసం! వ్యవసాయంలో పలు ప్రయోగాలుచేస్తూ పంటలను సాగుచేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్న ఎంతోమంది సామాన్యరైతులున్నారు. వారిని ఇటువంటి పదవులకు ఎంపిక చేస్తే .. వారికి వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉంటుంది కనుక రైతులకు ఉపయోగపడే నిర్ణయాలను, పద్ధతులపై ఆసక్తిని చూపిస్తారు. అంతేకాని బ్యూటీపార్లర్ నడుపుకునేవారిని, వ్యాపారాలు చేసుకునేవారికి విజ్ఞానానికి పట్టుకొమ్మలైన విశ్వవిద్యాలయాల్లో అందునా ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవకాశం కల్పించడమంటే మేం చేసినా చెల్లుబాటవుతుందని, మాకు, మా సంబంధీకులకు పదవులే ముఖ్యం. మిగిలినవి ఏమైపోతే మాకేమి?. అన్నట్లుగా వుంది పాలకుల ఈ చర్య అంటున్నారు ఎంతోమంది విజ్ఞానప్రేమికులు. నిజమే బ్యూటీపార్లర్‌కు వ్యవసాయానికి సంబంధం ఏమిటో? ఎంపికచేసిన వారికే తెలియాలి?