నేడు కొత్త... రేపటికి పాతేనా...!
posted on Oct 1, 2012 9:36AM
జాషువాను జాతీయకవిగా గుర్తించేలా కేంద్రానికి తగు సిఫార్సులు చేస్తామని ఉపముఖ్యమంత్రి, తెలుగు అకాడమీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు అకాడమీలో జాషువా పరిశోధనా పీఠాన్ని ఏర్పాటుచేశామన్నారు. జాషువా 117వ జయంతి ఉత్సవాలు నిర్వహణ సందర్భంగా ‘జాషువా సాహితీ పురస్కారాలు`2012’ ప్రదానోత్సవంలో ఆయన ఈ మాటలన్నారు. అదే జరిగితే ప్రతి తెలుగువాడు ఎంతగానో సంతోషిస్తాడు. అయితే అది అమలు జరిగేనా అన్న అనుమానం అభిమానులకు కలుగుతోంది. ఎందుకంటే తెలుగువాడు అంటే కేంద్రానికి చాలా చిన్నచూపు. దీనికి తోడు తెలుగువారికి తెలుగువాడే శత్రువు అన్న కొత్త సామెతను సైతం చాలా సార్లు నిజం చేశారు. దేశంలోనే అత్యధికులు మాట్లాడే రెండో పెద్ద భాషగా గుర్తింపువున్న తెలుగును ఆ స్థాయిలో కేంద్రం గౌరవిస్తోందా... అధికారభాషగా వున్న మన రాష్ట్రం పూర్తిగా అమలుచేస్తోందా.. ఇటువంటివాటిపై ఇప్పటికే ఎన్నో సందేహాలు, వాస్తవాలు ఎంతోమంది పెద్దలకు తెలియనికావు. మరి ఇప్పుడు జాషువా వంటి కవికి జాతీయకవిగా గుర్తించేలా చేస్తారా అన్నది అనుమానం. మహాకవులుగా జనహృదయాల్లో నిలిచిపోయి, జాతికి, తెలుగుకు ఘనకీర్తిని తెచ్చిన ఎందరో కవులున్నారు. అంతేందుకు అందరూ చదివే ప్రతిజ్ఞను తెలుగువాడే వ్రాశాడని ఈ మధ్యనే తెలిసింది. వందమాతరం, జనగణమనలకు ఆయా రచయితల పేర్లున్నట్లే ప్రతిజ్ఞకు దాన్ని వ్రాసిన మన తెలుగాయన పేరు ఉండేలా కృషి చేస్తే మరింత ఆనందిస్తారు. అప్పుడు చెప్పడమే తప్ప, ఆ తర్వాత పట్టించుకోని మనవారి నైజం అందరికి తెలిసిందే కనుక నేటికి కొత్త రేపటికి పాత అన్నట్లుగా ఉంటుందని తెలుగుభాషా ప్రేమికులు నిర్వేదం ప్రకటిస్తున్నారు. వాస్తవాలు ఆలోచిస్తే....నిజానికి నిజం అంతేనేమో!