కేసులు పెట్టి ఏం పీకావ్.. జగన్ రెడ్డి! చంద్రబాబు ఉగ్రరూపం..
posted on Oct 22, 2021 7:49PM
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. ఇది ఉగ్రవాదం కాకపోతే మరేమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ దుష్పరిపాలన ప్రజలందరికీ తెలియాలని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదని తెలిపారు. దాడులు చేసిన వాళ్లపై కేసులు లేవు.. పట్టాభిపై కేసు పెడతారా అని నిలదీశారు. పట్టాభి అన్న మాట ఏంటో నేను ఇంతవరకు వినలేదన్నారు. పట్టాభి మాటలకు కొత్త అర్ధాలు తీసి దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసులు, అధికారులకు భయపడి మేం సరెండర్ కావాలా అని చంద్రబాబు అన్నారు.
36 గంటల దీక్షను విరమించిన చంద్రబాబు.. ఆవేశంగా మాట్లాడారు. 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఇక్కడున్నాయని, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్‌పై దాడి ఉగ్రదాడేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 100 గజాల దూరంలో డీజీపీ ఆఫీస్ ఉందని, డీజీపీ సరైన చర్యలు తీసుకుంటే ఇది జరిగేదా..? అని ప్రశ్నించారు. ఏపీని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా పాలసీలు డిసైడ్ చేయడానికి వీల్లేదన్నారు. కల్తీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్‌తో ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఏపీలో లక్ష కోట్ల డ్రగ్స్ ఉన్నట్టు మీడియా కథనాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు.