29 రకాల వంటకాలు.. నాన్ వెజ్ స్పెషల్! గులాబీ ప్లీనరీలో ఘుమఘుమలే..
posted on Oct 22, 2021 9:54PM
తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లినరీకి సర్వం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ ప్లీనరీని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకే రెండేండ్లకోసారి జరిగే గులాబీ పండుగ భారీ స్థాయిలో జరుగుతుంది. టీఆర్ఎస్ ప్లీనరీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వంటకాలే. ప్రతి ప్లీనరీలోనూ అతిథులకు వడ్డించే భోజనమే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు సీఎం కేసీఆర్.
అక్టోబర్ 25న హైటెక్స్ లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. కుకింగ్ సెక్షన్ ఇప్పటికే సన్నాహాలు చేసేస్తోంది. ఈసారి ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా వడ్డించనున్నారు. ఫుడ్ కమిటీ ఇన్‌చార్జిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈసారి 29 రకాల వంటలను సిద్ధం చేయబోతున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు.
ప్లినరీలో మెన్ ఇదే..
ధమ్ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్, బోటిఫ్రై, ఎగ్ మసాలా, రుమాల్ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్‌రైస్, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు+క్రీమ్, పెరుగు, వంకాయ చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్, వడియాలు, జిలేబీ, డబల్ కా మీఠా, ఐస్ క్రీం, గ్రీన్ సలాడ్, బటర్ రైస్, డ్రై ఫ్రూట్స్, కారా, బూంది, లడ్డూ, చాయ్ అందివ్వనున్నారు.
ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలకు రుచికరమైన భోజనం అందిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. సుమారు 15 వేల మందికి వెజ్, నాన్‌వెజ్ వంటల రుచి చూపించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం చెయ్యి తిరిగిన 500 మందిని నియమిస్తున్నామన్నారు. వాలంటీర్లు, ప్రత్యేక సిబ్బందితో ఒకేసారి 8 వేల మంది భోజనాలు చేసేలా చూస్తున్నామని తెలిపారు ప్లీనరీ ఫుడ్ ఇంచార్జ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.