తుపాను బాధితులకు పరామర్శల వెల్లువ
posted on Nov 5, 2012 11:26AM

తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు, వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒకేసారి కదిలారు. ముగ్గురూ వాళ్ల పర్యటనలకోసం హైదరాబాద్ నుంచి ఒకేసారి వస్తున్నారన్న వార్తతో గన్నవరం విమానాశ్రయంలో కోలాహలం కనిపిస్తోంది.
సీఎం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో పర్యాటిస్తారు. వైయస్ విజయలక్ష్మి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. నేతల రాక కోసం గన్నవరం విమానాశ్రయం వద్దకు ఆయా పార్టీల నేతలు చేరుకుంటున్నారు.
నీలం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకూ 27మంది మరణించారు. విశాఖ జిల్లాలో వరాహ, శారద, తాండవ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్ లేక జనం అల్లాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో భోజనం, తాగడానికి మంచినీళ్లు దొరక్క జనం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీకాకుళంలో నెల్లిగడ్డ వాగు పొంగిపొర్లుతోంది. విజయనగరంలో పదికి పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పంట మునిగిపోయింది. చంపావతి నదికి వరద పోటెత్తింది. నీలం తుఫాను ప్రభావంతో గారలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుఫాను బాధిత ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఈ రోజు రద్దయింది.