ప్రభుత్వంపై కేసేయండి : ప్రజలకి చంద్రబాబు సలహా
posted on Oct 17, 2012 10:48AM
.jpg)
చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర పదిహేను రోజులు పూర్తిచేసుకుంది. వెళ్లినచోటల్లా జనం చంద్రబాబుకి నీరాజనాలు పడుతున్నారు. కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ఎక్కడ చూసినా కరెంట్ కష్టాలు, ఉపాధి లేని స్పష్టంగా కనిపిస్తున్నాయ్. జనం బాబుకి ఫిర్యాదులు చేస్తున్నారు. టిడిపి అధికారంలోకొస్తే రైతులకు, సామాన్యులకు ఏ కష్టమూ లేకుండా చూస్తానని చంద్రబాబు హామీఇస్తూ ముందుకు కదులుతున్నారు. ఒక్కో చోట ఆగినప్పుడు జనం కష్టాలు, బాధలు చంద్రబాబుని కదిలించేస్తున్నాయ్. అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేరోజు త్వరలోనే వస్తుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు. విద్యుత్ కోతలపై, నాణ్యమైన విద్యుత్ ని అందించడంలో వైఫల్యంపై సర్కారుపై కేసేయాలంటూ జనానికి హితబోధ చేస్తున్నారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్న సర్కారుని నిలదీయాలంటూ మండిపడుతున్నారు. బుధవారం చంద్రబాబు యాత్ర ఆదోని నియోజకవర్గంలో.. దసపురం గ్రామంనుంచి మొదలై ఆరేకల్లువరకూ యాత్ర చేశాక రాత్రికి బాబు బస అక్కడే.. ఫిజియో థెరపిస్ట్ ఎంతగా ట్రీట్మెంట్ ఇస్తున్నా కాలు నొప్పి చంద్రబాబుని వేధిస్తూనే ఉంది. మోకాలినొప్పి కారణంగా సాయంత్రమయ్యేసరికి చంద్రబాబు కాస్త నిదానంగా నడవాల్సొస్తోంది. ఒకవేళ బాబు యాత్రని పూర్తి చేయలేకపోతే లోకేష్ ని రంగంలోకి దించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.