తెలుగుదేశం మహానాడు వాయిదా!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం భారీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా స్వయంగా నిర్వమించుకున్న పోస్ట్ పోల్ సర్వే ఫలితం కూడా భారీ విజయాన్ని ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమేన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకుందామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పారు. 

పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని  ఏటా మే 27, 28 తేదీలలో  పార్టీ మహానాడు జరుగుతుంది. అయితే ఆ మహానాడును వాయిదా వేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో  ప్రభుత్వ ఏర్పాటు, ఎన్నికల ఫలితాలకు ముందు  ఓట్ల లెక్కింపు ముందు చేప్టటాల్సిన కార్యక్రమాలు, ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించాల్సి ఉన్న నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు.  

ఈ విషయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించారు. అయితే  ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ కు నివాళులర్పించడం, పార్టీ జెండా ఆవిష్కరించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.   ఇక మహానాడు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రకటించనున్నట్లు తెలిపారు.