విజన్... విజ్ డమ్ ల మేలుకలయిక చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో పదేపదే తనలో 1995 నాటి చంద్రబాబును చూస్తారని చెబుతున్నారు. ఆయన దూకుడు, ఆయన వేగం చూస్తుంటే అది నిజమేనని అనిపించక మానదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనను తాను ముఖ్యమంత్రిగా కంటే రాష్ట్రానికి సీఈవోగా ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఆయన ప్రణాళికలు, కార్యాచరణ అంతా హైటెక్ సీఎం అని అందరూ పిలిచేలా చేశాయి. అప్పట్లోనే ఆయన ఐప్యాడ్ లలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లను తీసుకుని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వెళ్లి వాటిని   హైదరాబాద్ కు రప్పించారు. బిల్ గేట్స్ లాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో గంటల తరబడి చర్చించారు. వారిని ఇంప్రెస్ చేయగలిగారు. అంతేనా తన విజన్ తో వారిని తన అభిమానులుగా మార్చేసుకున్నారు. 

ఇప్పుడు 2024లో కూడా అయన అదే ఒరవడిలో ముందుకు సాగుతున్నారు.  మెటా సంస్థ‌తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి, ప్ర‌భుత్వ ప‌త్రాల‌ను వాట్సాప్ ద్వారా పంప‌డం, డ్రోన్ టెక్నాల‌జీతో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డం లాంటివి ఆరంభించారు. తొలిద‌శ‌లో ఈ నెలాఖ‌రుక‌ల్లా వంద‌ర‌కాల సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా అందించేలా గత నెల 22న మెటాతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్ బిజినెస్‌, లామా లాంటి ఏఐ టెక్నాల‌జీల‌తో ప‌రిపాల‌నా సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ ప‌త్రాల కోసం ప‌డుతున్న ఇబ్బందుల‌ను తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చూశాన‌ని, ఇప్పుడు వాట‌న్నింటి ప‌రిష్కారం చాలా సుల‌భంగా వాట్సాప్ ద్వారా దొర‌క‌డం అనేది చ‌రిత్రాత్మ‌క‌మ‌ని చంద్ర‌బాబు కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 

మ‌రోవైపు.. రాష్ట్రాన్ని డ్రోన్ హ‌బ్‌గా మారుస్తామ‌ని కూడా చంద్ర‌బాబు చెబుతున్నారు. క‌ర్నూలు స‌మీపంలో 300 ఎక‌రాల‌ను  ఇందు కోసం కేటాయించారు.  అమ‌రావ‌తిలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించి అందరినీ అబ్బురపరిచారు. అమ‌రావ‌తిని, బుద్ధుడిని కూడా డ్రోన్ల‌తో ఆవిష్క‌రించారు. ఆ వెంటనే ఆయన సీప్లేన్ సేవలపై దృష్టి పెట్టారు. దేశంలోనే తొలి సారిగా ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీకాకుళం వరకూ  ట్రయల్ రన్ నిర్వహించారు. స్వయంగా  సీ ప్లేన్‌లో విహ‌రించారు. విజ‌య‌వాడ నుంచి శ్రీశైలం వెళ్లి, అక్క‌డ రోప్ వే ద్వారా ప్ర‌యాణించి ఆల‌య ద‌ర్శ‌నం చేసుకుని, తిరిగి సీ ప్లేన్‌లోనే విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు.

ఇలా  ఆధునికతను అందిపుచ్చుకుంటూ.. టెక్నాలజీని ప్రజాప్రయోజనాల కోసం సమర్ధంగా వినియోగించుకుంటూ.. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తూ చంద్రబాబు 1995 నాటి సీబీఎన్ ను గుర్తు చేస్తున్నారు. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా చెరగని సంతకంలా కనిపిస్తున్నారు.   ,గ‌తంలో హైదరాబాద్‌కు ఎలాంటి ఇమేజి తెచ్చిపెట్టారో అంతకు మించి అమరావతిని అభివృద్ధి చేసి ఏపీ రాజధానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.  చంద్రబాబుకున్న  దూరదృష్టి, టెక్నిక‌ల్ విజన్ సమకాలీన రాజకీయాల్లో ఎవ్వరికీ లేదనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.