తెలంగాణలో కోల్డ్ వేవ్.. వణికిస్తున్న చలిపులి!
posted on Nov 19, 2024 9:03AM
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. జనం చలిపులి పంజా దెబ్బకు గజగజలాడుతున్నారు. రాష్ట్రంలో సోమవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా సిర్పూర్ లో 12.3 డిగ్రీలు, వాంకిడిలో 12.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.మొత్తంమీద రాష్ట్ర వ్యాప్తంగా సగటున 12 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
సాధారణంగా డిసెంబర్ మూడో వారం తరువాత ఉండే స్థాయిలో చలి తీవ్రత నవంబర్ రెండో వారంలోనే వణికించేస్తుండటంతో ముందు ముందు మరింతగా చలితీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది శీతాకాలం చలి ఎముకలు కొరికేయడం ఖాయమని అంటున్నారు. నవంబర్ రెండో వారంలోనే ఈ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయంటే వచ్చే రెండు నెలలూ మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రతకు తోడు పొగమంచు తోడై జనాలను ఇబ్బందులకు గురి చేయడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, చలి నంచి రక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.