వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం.. నిందితుల గుండెల్లో భయం!

గత ఐదేళ్లుగా డాక్టర్ వైఎస్ సునీత అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలనీ, అలాగే హత్య కుట్రదారులు, సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలన్న సంకల్పంతో ఆమె గత ఐదేళ్లుగా శ్రమిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు.  వైఎస్ సునీత న్యాయపోరాటం ఫలితంగానే వైఎస్ వివేకా హత్య జరిగిన నాడు ఎవరైతే అప్పటి విపక్ష నేతలపై ఆరోపణలు గుప్పించారో వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా   బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు.  

అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు అంతు అనేది కనిపించకుండా ఎందుకు సా..గుతూ ఉండడానికి,  ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా  పురోగతి లేకుండా నిలిచిపోవడానికి కారణమేంటి, కారణం ఎవరు అన్న విషయంలో ఇప్పుడు ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేకుండా పోవడానికి  కూడా వైఎస్ సునీత అలుపెరుగని పోరాటమే కారణం.  అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతుండడానికి కారణం కూడా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మాత్రమే అనడంలో ఇసుమంతైనా సందేహానికి తావు లేదు.  తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం   నిస్సందేహంగా  చారిత్రాత్మకం. ఈ పోరాటంలో ఆమె ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు.  స్వయానా పెదనాన్న కుమారుడు, సోదరుడు అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి తన న్యాయపోరాటానికి అడుగడుగునా అవరోధంగా నిలిచినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ అండగా నిలిచి కాపాడుతూ.. తనను వేధింపులకు గురిచేసినా తట్టుకుని నిలబడ్డారు. 

సరే ఇప్పుడు గత ఐదేళ్ల  జగన్ అరాచక పాలనకు ఇప్పుడు తెరపడింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక వివేకా హత్య కేసు దర్యాపు వేగం పుంజుకుని దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని అంతా భావించారు. అయితే కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి ఐదు నెలలైనా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ లోగా వివేకా హత్య కేసులో అరెస్టైన వారందరికీ బెయిలు వచ్చేసింది. వారు దర్జాగా బయట తిరుగుతున్నారు.  
ఈ పరిస్థితుల్లో డాక్టర్ సునీత మరో సారి న్యాయపోరాటానికి కొంగు బిగించారు. తండ్రి హత్య కేసు పురోగతిపై ఆరా తీస్తున్నారు. సత్వర న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ఇటీవల ఆమె  కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా చేయడంలో సహరించాలని కోరారు. దీనికి ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత సునీత మంగళవారం (నవంబర్ 19) ఏపీ అసెంబ్లీకి వచ్చి  డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో భేటీ అయ్యారు. ఆయనతో వివేకా హత్య కేసు గురించి చర్చించారు. ఇప్పటికే ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత తో  భేటీ అయ్యారు. తండ్రి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసి దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలని కోరారు. వారిరువురూ కూడా సానుకూలంగా స్పందించారు.  

తాజాగా అసెంబ్లీలోని పీఎంవో కార్యాలయానికి వెళ్లిన సునీత అక్కడి అధికారులతో తన తండ్రి వివేకా హత్య కేసు పురోగతిపై చర్చించారు. అంతకు ముందు ఇటీవల సచివాలయంలో చంద్రబాబుతో సునీత భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు హుకిల్డ్ బాబాయ్ అన్న సస్పెన్స్ కు తొందరలోనే తెరపడుతుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సునీత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, పీఎంవో అధికారులతో భేటీ అవ్వడం తండ్రి హత్య కేసు పురోగతిపై చర్చించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు రోజుల కిందట కడప ఎస్పీతో భేటీ సందర్భంగా వివేకా హత్య కేసుకు సంబంధించి కొన్ని కేసులు హైదరాబాద్ లో నమోదై ఉన్నాయనీ, వాటిని ఇక్కడకు బదలీ చేసి సత్వర దర్యాప్తు జరిపే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ హయాంలో పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయిన వ్యవస్థలు ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టు కుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు విచారణ, దర్యాప్తులో వేగంగా కదలికలు కనిపిస్తు న్నాయి. డాక్టర్ సునీత అలుపెరుగని పోరాటం ఒక తార్కిక ముగింపునకు వచ్చేలా ఉంది. ఔను త్వరలోనే హు కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు సమాధానం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.