ఇప్పేడేమంటావ్ జగన్ రెడ్డీ.. రద్దు చేద్దామా?
posted on Nov 19, 2024 4:59AM
ఏపీలో శాసన సభ, సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. జగన్ మోహన్‌రెడ్డితోసహా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది శాసనసభకు రాకుండా బాయ్ కాట్ చేసినప్పటికీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను సభలో లేవనెత్తుతూ, వాటి పరిష్కారాల కోసం మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు అర్ధవంతంగా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్ష సభ్యులను బూతులు తిట్టడానికే అధికార పార్టీ సభ్యులు, మంత్రులు పరిమితం అయ్యారు. దీంతో ఆ ఐదేళ్ల కాలంలో ఒక్కసారిగా కూడా అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ జరగలేదు. తద్వారా ప్రజా సమస్యలపై సభలో చర్చించిన దాఖలాలు చాలా తక్కువ. మరో వైపు శాసన మండలిలో వైసీపీకి మెజార్టీ సభ్యులు ఉండటంతో సభకు హాజరువుతున్నారు. అయితే, మండలిలో వైసీపీ సభ్యుల తీరు ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నప్పటికీ వారు ఏదోఒక వంకతో మండలి నుంచి వాకౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు సరియైన సమాధానం చెప్పడం లేదంటూ సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో ప్రశ్నలు వేయడం.. వాటికి మంత్రులు స్పష్టమైన సమాధానం ఇస్తుంటే ఏదోఒక గొడవచేసి సభను వాకౌట్ చేయడం నిత్యకృత్యంగా మారింది. ఫలితంగా మండలిలో వైసీపీ సభ్యుల తీరు పట్ల జనంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. తద్వారా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకుకూడా వారు అనర్హులు అని తేల్చేశారు. కానీ వైసీపీ అధినేత, కడప ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మాత్రం వితండవాదం చేస్తున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ మారం చేస్తున్నాడు. ప్రతిపక్ష హోదాకు వైసీపీ పనికిరాదని ప్రజలు స్పష్టం చేసిన తరువాత కూడా.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని జగన్ డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగానే ఉంది. దీంతో జగన్ నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు సైతం సమర్ధించడం లేదు. మరోవైపు శాసన మండలిలో సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో వైసీపీ సభ్యులు సభకు హాజరవుతున్నారు. దీంతో ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఈ పేద రాష్ట్రానికి శాసనమండలి అవసరమా అంటూ వ్యాఖ్యలు చేశాడు. మండలిలో తెలుగుదేశం సభ్యుల సంఖ్యా బలం ఎక్కువగా ఉందని మండలినే రద్దు చేసేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ అది సాధ్యంకాలేదు. అయితే ఇప్పుడు వైసీపీకి శాసన మండలే దిక్కయ్యిది. దీంతో ఇదంతా దేవుడి రాసిన స్ర్కిప్ట్ అంటూ కూటమి నేతలు కామెంట్లు చేస్తున్నారు.
శాసన మండలిలో ఎంతో మంది వివిధ వర్గాలకు చెందిన మేధావులు ఉంటారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో అటుంచితే. .శాసన మండలిలో అర్ధవంతమైన చర్చను జరిపే అవకాశం ఉంటుంది. ఇలాంటి మండలిని జగన్ మోహన్ రెడ్డి రద్దు చేయాలని చూశారు. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం.. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఇంత ఖర్చు అవసరమా అంటూ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రశ్నించారు. ఇప్పుడు ఆ శాసన మండలినే వైసీపీకి పెద్ద దిక్కుగా మారింది. మండలిలో మొత్తం 58 సీట్లకుగాను వైసీపీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది నామినేటెడ్ సభ్యులు. తెలుగుదేశం నుంచి ఎనిమిది మంది, నలుగురు ఇండిపెండెంట్లు, పీడీఎఫ్ నుంచి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, గతంలో మండలిని రద్దుచేయాలన్న జగన్.. ఇప్పుడు అలా అనగలరా అంటూ కూటమి నేతలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి వస్తున్నప్పటికీ.. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకు వారు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పలు అంశాలపై మంత్రులను ప్రశ్నిస్తున్న వారు.. తిరిగి మంత్రులు సమాధానం చెప్పే సమయంలో నానా రభస చేసి సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. ప్రతీరోజూ ఇదే తంతు జరుగుతుండటంతో ఈ మాత్రానికి మండలికి పోవడం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.