రామ్ గోపాల్ వర్మ అరెస్టు ఖాయమేనా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు మంగళవారం (నవంబర్ 19) విచారించనున్నారు. సామాజిక మాధ్యమంలో ఇన్డీసెంట్ పోస్టులపై తెలుగుదేశం నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసులో రామ్ గోపాల్ వర్మ కు మద్దిపాడు పోలీసు స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా నోటీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా తనపై నమోదైన కేసు కొట్టివేయాలనీ, అలాగే అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలనీ కోరుతూ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. అవసరమైతే తరువాత బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అలాగే అందుకున్న నోటీసుల మేరకు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో కోర్టు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు లైన్ క్లియర్ చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిగా అసభ్య, అనుచిత పోస్టులు పెట్టి కోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి తప్పించుకోవచ్చని భావించిన రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.

ఇంతకీ రామ్ గోపాల్ వర్మమీద కేసు ఎందుకు నమోదైందంటే.. గతంలో అంటే జగన్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. వీటిపైనే ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన తెలుగుదేశం నాయకుడు రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.