విచారణకు రామ్ గోపాల్ వర్మ గైర్హాజర్.. వ్యక్తిగత పనులున్నాయంటూ వాట్సాప్ మెసేజ్
posted on Nov 19, 2024 11:38AM
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజర్ అయ్యారు. మంగళవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆ మెసేజ్ లో పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ తన వ్యక్తిగత పనులు ఉండటం వల్ల విచారణకు హాజరు కావడానికి నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. ఆ తరువాత తప్పకుండా విచారణకు వస్తానని రామ్ గోపాల్ వర్మ తన మెసేజ్ లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తనపై కేసు క్వాష్ చేయాలని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టును రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల నోటీసుల మేరకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరౌతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా రామ్ గోపాల్ వర్మ చివరి నిముషంలో వ్యక్తిగత పనులంటూ డుమ్మా కొట్డడం సంచలనం రేకెత్తిస్తోంది. పోలీసులు ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.