కేంద్ర క్యాబినెట్ విస్తరణ?
posted on Oct 17, 2012 10:39AM
.jpg)
కేంద్ర క్యాబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రథాని మన్మోహన్, యూపీయే అధ్యక్షురాలు సోనియా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వేరువేరుగా సమావేశం కావడంతో విస్తరణ ఊహాగానాలు ఊపందుకున్నాయ్. మహాలయ పక్షాలు పూర్తై దసరా శుభ ఘడియలు వచ్చేశాయ్ కనుక మంత్రివర్గ విస్తరణకు అనుకూలం సమయం వచ్చినట్టేనని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రణబ్ ఈ నెల 20న దుర్గాపూజకోసం తన స్వగ్రామానికి వెళ్తుండడంతో ఆలోపుగానే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు ఖాళీ చేసిన సీట్లతోపాటు డిఎంకె మంత్రులు రాజా, దయానిధి మారన్ ల సీట్లుకూడా ఖాళీగానే ఉన్నాయ్. తాము కోల్పోయిన మంత్రి పదవుల్ని తిరిగి చేపట్టే ఆలోచనేదీ లేదని కరుణానిధి తేల్చిచెప్పడంతో ఆ ఖాళీల్నికూడా పూరించడం అనివార్యమయ్యింది. రాహుల్ గాంధీకి సన్నిహితులుగా భావిస్తున్న యువనేతలకు విస్తరణలో పెద్దపీట వేయాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకూ రెండు మంత్రి పదవుల్ని చూస్తున్న వాళ్లకి ఇకపై ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏఐసీసీలోకూడా పెద్ద ఎత్తున మార్పులు చేయాలని సోనియా భావిస్తున్నారట. రాహుల్ గాంధీకి సంస్థాగతమైన కీలకపదవిని కట్టబెట్టేందుకు మేడం పావులు కదుపుతున్నట్టు సమాచారం.