కళ్ల ముందు హత్య జరిగితే పట్టించుకోం. ఎందుకంటే!
posted on May 4, 2017 3:33PM
1964 మార్చి 13: న్యూయార్కులో Catherine Genovese అనే 28 ఏళ్ల అమ్మాయి రోడ్డు దాటుకుని తన ఇంట్లోకి వెళ్లబోతోంది. ఇంతలో ఓ సీరియల్ కిల్లర్ ఆమె మీద దాడి చేశాడు. దారినపోయేవారు చూస్తుండగా Catherineని దారుణంగా హతమార్చాడు. తనని రక్షించమంటూ కేథరీన్ ఎంత అరిచినా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అక్కడ దాడి జరుగుతోందన్న విషయం పోలీసులకు చెప్పేందుకు కూడా ఎవరూ ప్రయత్నించలేదు. దీంతో Bystander Effect అనే తత్వం గురించి చర్చ మొదలైంది.
ఏమిటీ ఎఫెక్ట్?
అమెరికా పోలీసు శాఖ ప్రకారం 70 శాతం దాడులు నలుగురూ చూస్తుండగానే జరుగుతాయి. 52 శాతం దొంగతనాలు జరిగేటప్పుడు కూడా చుట్టుపక్కలవారు చూసీ చూడనట్లుగా సాగిపోతుంటారు. ఇలా తమ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని Bystander Effect అంటారు. గొడవలోకి దిగితే తనకి ఏదన్నా జరుగుతుందనే సహజమైన భయం ఎలాగూ ఉంటుంది అంతకు మించిన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు సైకాలజిస్టులు.
- నలుగురూ ఉండటం వల్ల... నేరాన్ని అడ్డుకునే బాధ్యత ఎవరో ఒకరు తీసుకుంటారులే అన్న నిర్లిప్తత ఏర్పడుతుంది. దీనిని Diffusion of responsibility అంటారు.
- సంఘటనాస్థలంలో ఉన్నవారంతా ఏం చేయకపోవడంతో... అలా ఏం చేయకుండా ఉండటమే మంచిదేమో అన్న అపోహ ఏర్పడుతుంది.
- హత్య, దాడిలాంటి సంఘటనలకి మనం సిద్ధంగా ఉండం. దాంతో అలాంటివి చూసినప్పుడు మెదడు అయోమయానికి లోనవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోందో, దానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియని సందిగ్థంలో గుడ్లప్పగించి చూస్తుండిపోతాము.
ఏం చేయాలి?
Bystander Effect వినడానికి బాగానే ఉంది. కానీ మనం కూడా దానికి లొంగిపోతే ఎలా! అందుకని కళ్ల ముందు ఏదన్నా ఘోరం జరుగుతున్నప్పుడు ఈ Bystander Effectని అధిగమించేందుకు కొన్ని ఉపాయాలు కూడా సూచిస్తున్నారు.
- అయోమయంగా చూస్తూ ఉండిపోకుండా... అక్కడేం జరుగుతుందో అంచనా వేసే ప్రయత్నం చేయాలి.
- మీ వంతుగా అందులో పాలుపంచుకునే అవకాశం ఏమేరకు ఉందో ఆలోచించాలి.
- దాడి చేస్తున్న వ్యక్తిని మాటల్లోకి దింపితే హింసకి పాల్పడే అవకాశం కూడా తగ్గుతుంది.
- ఈ సందర్భంలో చుట్టూ మూగేవారిని కలిసికట్టుగా ఉసిగొల్పే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.
- ఇదివరకు నేరం గురించి సమాచారం ఇచ్చేవారినీ, గాయపడిన వ్యక్తులని హాస్పిటల్‌కు తీసుకువెళ్లేవారినీ విచారణ పేరుతో తెగ వేధించేవారు. ఈ విచారణ భయంతోనే చాలామంది వెనకడుగు వేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు చట్టాలు మారాయి. సాయపడేవారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం వదిలి ప్రమాదంలో ఉన్నవాడికి సాయపడే ప్రయత్నం చేయాలి.
అన్నింటికీ మించి, అసలు ఈ Bystander Effect గురించి అవగాహన ఉంటే చాలు... మనం దానికి లొంగకుండా ఉంటామంటున్నారు సైకాలజిస్టులు.
- నిర్జర.