ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం!?

కేసీఆర్ నాయకత్వంలోని బారత రాష్ట్ర సమితి ఎన్సీపీలో విలీనం కాబోతోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. నిజంగా నిజం. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ శాఖ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో విలీనం కాబోతోంది.  గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందన్న మాట ఆ పార్టీ అధినాయకత్వమే మరిచిపోయింది.

టీఆర్ఎస్ నుంచి పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న ఆ పార్టీ అధినేత ఆశలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆవిరైపోయాయి. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఆ పార్టీ కన్న కలలు అంతకు ముందే గల్లంతయ్యాయి. దీంతో ఆ పార్టీ జాతీయ రాజకీయాల వైపు చూడటమే మానేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్   ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో పార్టీ కార్యకలాపాలను ఆర్భాటంగా ప్రకటించి ఆయా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేపట్టేశారు.

అయితే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో ఆయా రాష్ట్రాలలో పార్టీ శాఖల విస్తరణకు మంగళం పాడేశారు. అంతే కాకుండా ఓటమి అవమాన భారంతో కేసీఆర్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడంలేదు. దీంతో  ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. ఏపీలో ఆ పార్టీ అనవాలు కూడా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ ఎన్సీపీలో విలీనం కావడానికి రెడీ అయిపోయింది.

త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు మంగళవారం (అక్టోబర్ 1) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో  బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలందరూ ఉణ్నారు. దీంతో బీఆర్ఎస్ ఎన్సీపీలో విలీనం కావడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో  శషబిషలకేం తావు లేదనీ, తాము ఎన్సీపీలో విలీనం కానున్నామని బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు కుండబద్దలు కొట్టేశారు. ఈ నెల 6న పూణెలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో తామంతా ఎన్సీపీ తీర్థం పుచుకుంటామని చెప్పారు.