సోము వీర్రాజు కంటే ఊసరవెల్లి నయం!

సోము వీర్రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లూ జగన్ భజన చేసి తరించారు. జగన్ అడ్డగోలు నిర్ణయాలను, విధానాలనూ రాజును మించిన రాజభక్తి అన్న స్థాయిలో మద్దతు తెలిపి పునీతులయ్యారు. ఒక సమయంలో ఆయన బీజేపీ అధిష్ఠానానికి రాసిన లేఖలో అప్పట్లో రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కారణంగా ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారైందని పేర్కొన్నారు. ఆయన ఆ లేఖ రాసిన సమయంలో   తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు.. అధికారంలో ఉన్న వైసీపీతో సోము వీర్రాజు అంటకాగుతున్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఆ హోదాలో ఉన్న ఆయన  రాష్ట్ర పార్టీ బలహీనం కావడానికి విపక్ష నేత కారణం అంటూ  అధిష్ఠానానికి లేఖ రాయడాన్ని బీజేపీ శ్రేణులే తప్పుపట్టాయి.

అదొక్కటే కాదు.. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆయన టార్గెట్ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నట్లుగా విమర్శలతో చెలరేగిపోయారు. జగన్ కు వంత పాడటం కోసం ఆయన ఒంటెత్తు పోకడలకు పోయారు. అప్పట్లో ఆయన తీరును సొంత పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులే జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీని కనీసం ఉనికి మాత్రంగా కూడా లేకుండా చేయడమే లక్ష్యమా అన్నట్లుగా అప్పట్లో సోము వీర్రాజు తీరు ఉండేది.  సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం నుంచి ఒక ప్రతినిథి వర్గం హస్తినకు వెళ్లి మరీ సోము వీర్రాజుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. దానిపై సీరియస్ గా స్పందించిన   బీజేపీ హైకమాండ్ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్ చార్జ్, అప్పటి కేంద్ర మంత్రి మురళీధరన్ ను రాష్ట్రానికి పంపింది. ఆయన నేరుగా రాజమహేంద్ర వరం వచ్చి పార్టీ నేతలతో బేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  అప్పట్లో ఏపీలో జగన్ ప్రభుత్వ అవినీతిపై  చార్జిషీట్ దాఖలు చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినా సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ ఆ పని చేయలేదు.  ఇదంతా ఎందుకుంటే సోము వీర్రాజు ఎంతగా జగన్ భజనలో తరించారో చెప్పడానికే. 

అటువంటి సోము వీర్రాజు ఇప్పుడు స్వరం మార్చేశారు. చంద్రబాబు భజనకు రెడీ అయిపోయారు.  తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. అందుకు చంద్రబాబు తరఫున తానూ పూచీ అని వాకృచ్చారు.  తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయం అని విమర్శలు గుప్పించారు.

జగన్ అధికారంలో ఉండగా మంచి చెడూ మరిచి ఆయనతో అంటకాగిని సోము వీర్రాజును ఇప్పుడు బీజేపీలో పట్టించుకునే నాథుడే లేరు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. ఏదో ఒక నామినేటెడ్ పోస్టు, కనీసం ఎమ్మెల్సీ అంటూ సోము వీర్రాజు వెంపర్లాడుతున్నా బీజేపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికే సోము వీర్రాజు స్వరం మార్చారని బీజేపీ  శ్రేణులే అంటున్నాయి. ఇక తెలుగుదేశం వర్గాలైతే సోము వీర్రాజును వీర లెవెల్లో ట్రోల్ చేస్తున్నాయి.