రేవంత్ స్పీడ్ కు అధిష్ఠానం బ్రేకులు!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో పార్టీలో, పార్టీ క్యాడర్ లో కనిపించిన ఉత్సాహం నీరుగారిపోతోంది.  ఏ ముహూర్తాన హైడ్రా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూల్చివేతల పర్వానికి శ్రీకారం చుట్టారో కానీ, ఆ హైడ్రాయే ఇప్పుడు రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకుంది. అప్పటి వరకూ రేవంత్ కు ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో తిరుగులేని ఆమోదం కనిపించింది. ఎప్పుడైతే హైడ్రా అంటూ రేవంత్ దూకుడు పెంచారో అప్పుడే పార్టీలో, ప్రభుత్వంలో ఆయనపై వ్యతిరేకతకు అంకురార్పణ అయ్యింది. 

ఇక హైడ్రా కూల్చివేతలపై పార్టీ హైకమాండ్ కూడా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మరీ అక్షింతలు వేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక పార్టీలో సీనియర్ నాయకుడు, హైకమాండ్ కు సన్నిహితుడు అయిన మధుయాష్కీ తాజాగా కూల్చివేతలపై చేసిన వ్యాఖ్యలు, అవసరమైతే బాధితుల తరఫున పార్టీలో, కోర్టులో కూడా పోరాడుతానంటూ ఇచ్చిన హామీ చూస్తుంటే..రేవంత్ స్పీడ్ కు హైకమాండ్ బ్రేకులు వేసిందన్నది స్పష్టమౌతోంది. 

నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో  ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్, కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఆయన మూసీ  పక్కనే ఇళ్ళు నిర్మించుకొని దశాబ్ధాలుగా ఉంటున్న సామాన్య, మద్య తరగతి ప్రజల నివాసాలపై దృష్టి సారించారో అప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలైంది.  మూసీవాసులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.  హైకోర్టులో   20 పిటిషన్ల వరకూ దాఖలయ్యాయి.  ఈ ప్రాంతంలో ఇళ్ళ వ్యవహారం హైకోర్టులో ఉందంటూ ప్రతీ ఇంటి గోడపై ఫ్లెక్సీ బ్యానర్లు కనిపిస్తున్నాయి.   

ఇక హైడ్రా కమషనర్ రంగనాథ్ కు హైకోర్టు అక్షింతలు వేసింది.  శనిఆదివారాలలో ఇళ్ల కూల్చివేతలపై నిలదీసింది.  హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ శని, ఆదివారాలలో కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని సూటిగా ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, మరోసారి ఇలా చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించి   చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

హైడ్రా కూల్చివేతలతో ఒక్క హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఎన్నికల హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైనా, పాలనలో ప్రజల అంచనాలను అందుకోలేకపోయినా ఇంత వరకూ ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకత కనిపించలేదు. కొంత సమయం ఇద్దామన్నట్లుగానే ప్రజలు ఉన్నట్లు కనిపించింది. అయితే ఎప్పుడైతే హైడ్రా సామాన్యుల నివాసాలపై దృష్టి పెట్టిందో అప్పుడే ప్రజాగ్రహం భగ్గుమంది. పార్టీలో, కేబినెట్ లో సైతం హైడ్రా తీరుపై, రేవంత్ దూకుడుపై ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నుంచి రేవంత్ కు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.