పెళ్లిపీటలపై శివాలెత్తిన వధువు.. పెళ్లికొడుకు చెంప చెళ్లు.. ఎందుకంటే...
posted on Aug 28, 2021 5:33PM
మంటపంలో పెళ్లి జరుగుతోంది. పీటలపై పెళ్లికొడుకు పెళ్లికూతురు కూర్చున్నారు. పంతులు పెళ్లి మంత్రాలు చదువుతున్నారు. అంతలోనే అనూహ్య ఘటన. పెళ్లికూతురికి పిచ్చి కోపం వచ్చింది. ముందు మంత్రాలు చదువుతున్న పంతులు చెంప చెళ్లుమనిపించింది. ఆ తర్వాత పెళ్లికొడుకు చెంప వాయించింది. ఈ ఊహించని పరిణామంతో పెళ్లికొచ్చిన వారంతా అవాక్కయ్యారు. అసలేం జరిగిందో తెలుసుకొని అంతా ఆమెకే సపోర్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ పెళ్లికూతురుకు మరింత మద్దతు పెరుగుతోంది. ఇంతకీ పెళ్లివేదికపై ఆ పంతులు, పెళ్లికొడుకు చేసిన తప్పేంటి? ఆ వధువుకు అంత కోపం ఎందుకొచ్చింది? ఆ ఇద్దరి చెంపలు ఎందుకు చెళ్లుమనిపించింది?
పెళ్లిమండపంలో వధూవరులు పక్కపక్కన కూర్చొని ఉన్నారు. వారిచుట్టూ బంధువులు ఉన్నారు. పంతులు మంత్రాలు చదువుతున్నారు. ఈ తంతు జరుగుతుంటే వధువుకు ఏదో ఘాటైన వాసన వచ్చింది. ఏంటా అని కాస్త ఫోకస్ చేస్తే.. పంతులు గారు పొగాకు నములుతున్నారని గుర్తించింది. అంతే. ఆమె కోపం నషాళానికి పాకింది. ఫట్ మనీ పంతులు చెంప వాయించింది. పెళ్లి చేయాల్సినోడివి ఇలా పొగాకు తినడమేంటంటూ ఇంకో రెండు గట్టిగా తగిలించబోయింది. అంతలోనే ఆ పంతులు తేరుకున్నారు. నేనొక్కడినే గుల్కా తినడం లేదు.. పెళ్లికొడుకు కూడా తింటున్నాడంటూ అతని వైపు చూపించాడు. ఇంకేముంది. పెళ్లికొడుకు పని ఫసక్.
పంతులు గుట్కా తింటేనే ఒళ్లు మండిన ఆమెకు.. ఇక తనకు కాబోయే మొగుడు పెళ్లిపీటలపైనే గుట్కా తింటున్నాడంటే ఊరుకుంటుందా? మరింత ఆవేశంతో ఊగిపోయింది. పక్కనున్న పెళ్లికొడుకును.. గుట్కా తింటావా అంటూ టపీ టపీ మని చెంపపై కొట్టింది. గుట్కా ఊంచేయమంటూ గట్టిగా అదిరించింది. దెబ్బకు దడుసుకున్నాడు ఆ వరుడు. భయం భయంగా పైకి లేచి.. తుప్ తుప్ మని గుట్కాను ఊంచేశాడు. ఆ వరుడు భయంతో వణికిపోవడం చూసి చుట్టూ ఉన్న వారంతా తెగ నవ్వేశారు. పెళ్లికూతురు మాత్రం పీటలపై కూర్చొని అంతే కోపంతో.. కర్రెళ్ల చేస్తూ ఉండిపోయింది. ఆ తతంగం అంతా అక్కడున్నవారు వీడియో తీయగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. పెళ్లికూతురు చేసిన పనికి అంతా ప్రశంసిస్తున్నారు. పెళ్లిపీటలపైనే గుల్కా తింటున్న పెళ్లికొడుకును కామెంట్లతో కుమ్మేస్తున్నారు.