జగన్ ను ఎదుర్కొనే బెస్ట్ ఆప్షన్ కిరణేనా? పీకే డెరైక్షన్ లో కాంగ్రెస్ బలపడేనా? 

ఏపీలో పాత పేర్లు కొత్తగా తెరమీదికొస్తున్నాయి. 30 ఏళ్లు సీఎంగా ఉంటానని కలలు కన్న జగన్ ను ఇంటిదారి పట్టించేందుకు కాంగ్రెస్ అనూహ్యమైన ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఉమ్మడి ఏపీ ఆఖరు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేసి ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ మరణం తరువాత రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. హైకమాండ్ అడ్డు చెప్పింది. అయినా.. జగన్ ప్రజల్లోకి వెళ్లారు. అప్పటికే జగన్ మనసులోని మర్మాన్ని అర్దం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.... ఢిల్లీకి పూర్తిగా విధేయుడైన కిరణ్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించింది. జగన్ ను ఓ చూపు చూడాలని పురమాయించింది. ఆ పాత రికార్డే ఇప్పుడు కిరణ్ కు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

జగన్ పార్టీని చీలుస్తారనే భయంతో రాయలసీమకే చెందిన కిరణ్ ను అప్పట్లో అధిష్టానం బాగా వాడుకుంది. కిరణ్ ను సీఎం చేసి జగన్ బాబాయ్ వివేకాను కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో.. తమ కుటుంబంలోనే విభేదాలు తీసుకురావటం జగన్ కు నచ్చలేదు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి.. కొత్త పార్టీ పెట్టారు. కడప ఎంపీగా జగన్.. పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేసి గెలిచారు. ఆ టైంలో సీఎంగా ఉన్న కిరణ్ తో ఎలాగైనా జగన్ ను కంట్రోల్ చేయాలని.. పార్టీకి నష్టం జరగకుండా చూడాలని హైకమాండ్ ఆదేశించింది. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో కిరణ్ అన్ని పావులూ సక్సెస్ ఫుల్ గా వాడేశారు. కిరణ్ హయాంలోనే జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ మొదలైంది. జగన్ అరెస్టు కూడా జరిగింది. అందువల్లే జగన్ పెట్టిన పార్టీకి భవిష్యత్ ఉండదని కాంగ్రెస్ సహా.. కిరణ్ సైతం భావించారు. అయితే అనూహ్యంగా విజయమ్మ, షర్మిల కూడా గ్రౌండ్ లోకి వచ్చారు. అప్పుడు కిరణ్ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని టీడీపీ కూడా నిర్ణయించిన విషయం గమనించాలి. కిరణ్ సర్కారు గట్టెక్కి... బలం నిరూపించుకున్నాక 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పరాజయం పొందడం వేరే విషయం. హైకమాండ్ ఆదేశాలను అడుగడుగునా తు.చ. తప్పకుండా అమలు చేసిన వ్యక్తిగా కిరణ్ ఢిల్లీలో గుడ్ బుక్స్ లో ఉన్నారు.  

రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ సమైక్యాంధ్ర నినాదంతో కొత్త పార్టీ పెట్టి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-పవన్-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇప్పుడు జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ను వీడిన కిరణ్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ తో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో తాజా రాజకీయాలపై, సామాజికవర్గాల సమీకరణలపై కూలంకషంగా చర్చించారు. జగన్ వైపు వెళ్లిన కాంగ్రెస్ ఓటుబ్యాంకును వెనక్కి రప్పించే అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కిరణ్ రాహుల్ కు ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్లినవారిని తిరిగి తీసుకొస్తానంటూ కిరణ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో జగన్ వైఫల్యాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయ అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువ ఉన్నాయని, తనకున్న క్లీన్ ఇమేజ్ తో పాత కేడర్ ను కచ్చితంగా పార్టీవైపు మళ్లిస్తానని కిరణ్ హామీ ఇచ్చినట్టు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. 

తెలంగాణలో రేవంత్ తరహాలో ఏపీలో కొత్తగా పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాంటి క్వాలిటీస్ గానీ, ఇమేజ్ గానీ కిరణ్ కే ఉన్నాయని హైకమాడ్ డిసైడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ పేరు ఫైనల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ విప్ గా ఉన్న కిరణ్ కు.... జగన్ కు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉందని, జగన్ లోతుపాతులు తెలిసిన వ్యక్తిగా సరైన నిర్ణయాలు తీసుకోగలడని అంటున్నారు. నాడు పరిటాల రవి హత్య కేసులో జగన్ మీద టీడీపీ నేతలు పెద్దఎత్తులో విమర్శలు చేసినప్పుడు... జగన్ ను వెనకేసుకొచ్చింది కిరణే కావడం విశేషం. ఇలా కీలకమైన అన్ని అంశాల్లోనూ జగన్ లోతులు తెలిసిన వ్యక్తి కిరణేనని అధిష్టానం భావిస్తోంది. ఆ నమ్మకంతోనే కిరణ్ ను కీలకమైన పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖాయమైనట్టు చెబుతున్నారు.