మసీదు సమీపంలో బ్లాస్ట్.. 35 మంది మృతి
posted on Nov 29, 2014 8:18AM
నైజీరియాలో మసీదు దగ్గర జరిగిన పేలుళ్ళు 35 మందిని బలితీసుకున్నాయి. నైజీరియాలోని కానో మసీదు దగ్గర జరిగిన బాంబు పేలుళ్ళ కారణంగా 35 మంది మరణించగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారంలో చాలామంది పరిస్థితి విషమంగా వుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ముస్లింలు మసీదుకు చేరుకున్నప్పుడు ఈ పేలుళ్ళు జరిగాయి. మసీదుకు దూరంగా వున్న తీవ్రవాదులు జనం మీద కాల్పులు జరిపారు. ఆ తర్వాత పేలుళ్ళు జరిపి పరారయ్యారు. ఈ కాల్పులు, పేలుళ్ళకు ఇప్పటి వరకు ఏ తీవ్రవాద సంస్థా బాధ్యులుగా ప్రకటించుకోలేదు. కొంతకాలంగా నైజీరియాలో మారణహోమం సృష్టిస్తున్న బోకోహరామ్ తీవ్రవాదులే ఈ దారుణానికి కారణమై వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిపిన విధ్వంసకాండల్లో దాదాపు మూడు వేల మంది మరణించారు.