పవన్ కళ్యాణ్ విగ్రహం వద్దేవద్దు...
posted on Nov 29, 2014 8:37AM
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తాడేపల్లి గూడెం పట్టణంలో పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ విగ్రహం కూడా రెడీ అయిపోతోంది. పవన్ కళ్యాణ్ నిలువెత్తు విగ్రహం పిడికిలి బిగించి వున్నట్టుగా శిల్పులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇదిలా వుండగా, పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది అభిమానులు ప్రయత్నిస్తూ వుండటాన్ని మరికొంతమంది అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా ఎవరి విగ్రహాలైనా చనిపోయాకే పెడతారు. నిక్షేపంలా జీవించి వున్న పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని పెట్టాలని అనుకోవడం చాలా తప్పు అని సదరు అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానం వుంటే దాన్ని మరోలా ప్రదర్శించాలి, ఆయన ఆశయాల బాటలో నడవాలి. అంతేగానీ, బ్రతికున్న మనిషికి విగ్రహం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విగ్రహం ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తమ వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని అంటున్నారు. కొంతమంది విగ్రహం పెడతామంటారు.. మరికొందరు వద్దంటారు.. చివరికి ఏమౌతుందో వేచి చూడటం మనవంతు.