పవన్ కళ్యాణ్ విగ్రహం పెడుతున్నారు..
posted on Nov 29, 2014 5:35AM
ఈ అభిమానులనేవాళ్ళున్నారే.. ఒక్కోసారి వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియదు. సాధారణంగా ఎవరైనా పోయాక విగ్రహాలు పెడతారు. అభిమానం ముదిరిపోయిన అభిమానులు తాము అభిమానించే వారికి బతికుండగానే విగ్రహాలు పెట్టేస్తారు. మొన్నామధ్య ఉత్తరప్రదేశ్‌లో మాయవతి విగ్రహాలు అలాగే పెట్టారు. అలాగే తెలంగాణ దేవత సోనియాకి గుడి కట్టించి, అందులో ఆమె విగ్రహాన్ని కూడా మాజీ మంత్రి శంకర్రావు ఇటీవల పెట్టించారు. ఇప్పుడు బతికుండగానే విగ్రహాలు పెట్టించుకునే లిస్టులోకి పవన్ కళ్యాణ్ కూడా చేరబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పవన్‌కళ్యాణ్ విగ్రహం ఏర్పాటుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం పెనుమంట్ర సమీపంలోని నత్తారామేశ్వరంలో విగ్రహం కూడా రెడీ అయిపోతోంది. కొంతమంది జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్డర్ ఇచ్చిన మీదట ఈ గ్రామానికి చెందిన శిల్పి అరుణప్రసాద్ వడయార్ పవన్ కళ్యాణ్ నిలువెత్తు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. దీనిమీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.