బిల్ గేట్స్ సోర్స్ కోడ్ బుక్.. చంద్రబాబుకు గిఫ్ట్
posted on Jan 25, 2025 11:03AM

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, చంద్రబాబు మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు దార్శనికతకు తాను ఫిదా అయ్యానని బిల్ గేట్స్ పలు సందర్భాలలో చెప్పారు.
అటువంటి బిల్ గేట్స్ తో నారా చంద్రబాబు ఇటీవలి దావోస్ పర్యటన సందర్భంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా బిల్ గేట్స్ చంద్రబాబుకు ఒక అపురూప బహుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంతకీ బిల్ గేట్స్ ఇచ్చిన బహుమతి ఏమిటంటే... తాను కాలేజీ వీడిన తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీని ఎలా ఫ్లోట్ చేశారు, తన జర్నీకి సంబంధించిన అనుభవాలు, విశేషాలతో కూడిన సోర్స్ కోడ్ బుక్.
ఔను బిల్ గేట్స్ తన సోర్స్ కోడ్ బుక్ ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. దీనికి చంద్రబాబు బిల్ గేట్స్ కు థ్యాంక్స్ చెప్పారు. బిల్ గేట్స్ సోర్స్ కోడ్ బుక్ చాలా స్ఫూర్తిదాయకమని చెప్పిన చంద్రబాబు.. ఆ సోర్స్ కోడ్ బుక్ నవ్యాంధ్ర పురోగమనం విషయంలో తనకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.