విజయసాయి రాజీనామా ఆమోదం

విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆమోదించారు. విజయసాయి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉప రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని విజయసాయి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని పునరుద్ఘాటించారు.

అన్ని విషయాలూ వైసీపీ అధినేత జగన్ తో మాట్లాడాననీ, ఆ తరువాతే రాజీనామా చేశానని చెప్పారు. భవిష్యత్ లో ఇక రాజకీయాల గురించి మాట్లాడనని విస్పష్టంగా చెప్పిన విజయసాయి, కేసుల నుంచి బయటపడడానికే తాను రాజీనామా చేశానంటూ వస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎవరి చేతో కేసులు మాఫీ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్ గా మారలేదని చెప్పిన విజయసాయి వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవన్నారు.