పచ్చదనానికి ప్రాణం పోస్తున్నాడు.. 83 ఏళ్ల వయసులో ఓ తాత చేస్తున్నాడంటే..!


పచ్చదనం అంటే ఆ  తాతకు ప్రాణం.. ఇంతకీ ఎవరు ఈ తాత అంటే.. ఆయన పేరు సూర్యనారాయణ్..  తన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఆయనకు చాలా ఇష్టం.  ఆ ఇష్టమే ఆయనను ఒక సంకల్పానికి సిద్దం చేసింది. బెంగళూరు నివాసి అయిన ఈ పచ్చదనపు ప్రేమికుడు తనకు ఉన్న పరిశుభ్రతను చాలా సీరియస్ గా తీసుకున్నారు.  ఎంతగా అంటే తను నివసించే పరిసర ప్రాంతాలను చీపురు పట్టుకుని మరీ శుభ్రం చేసే అంత.  పచ్చదనానికి ప్రాణం పోస్తున్న ఆ తాత గురించి తెలుసుకుంటే..

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ 60 ఏళ్లు నుండి 62 ఏళ్లకు రిటైర్ అయిపోతారు.  65 ఏళ్లు దాటాయంటే ఇంటి పట్టున ఉంటూ భార్యా లేదా కోడలు వండిపెడుతుంటే తింటూ కృష్ణా, రామ అంటూ కాలక్షేపం చేస్తుంటారు.  మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ  సంతోషాన్ని,  జ్ఞాపకాలను పోగేసుకుంటూ ఉంటారు.  కానీ  బెంగళూరుకు చెందిన 83ఏళ్ల సూర్యనారాయణ్ మాత్రం అందుకు భిన్నం.  ఈయన మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. 60ఏళ్ల వయసులో రిటైర్ అయిన ఈయన 24ఏళ్ల నుండి తనకు ఎంతో ఇష్టమైన పరిశుభ్రతను తను నివసించే ప్రాంతాలకు  అంతా వ్యాప్తం చేస్తున్నాడు. ఈయన దగ్గరుండి ఎవరితోనూ పనులు చేయించట్లేదు.  స్వయంగా తానే చీపురు పట్టి వీధులు ఊడుస్తున్నాడు.  ప్రతి ఉదయం వీధులు ఊడ్చి శుభ్రం చేస్తాడు.  శుభ్రమైన మురుగు కాలువలు,  పచ్చదనం,  చెత్త ప్రదేశాలను మచ్చలేని ప్రదేశాలుగా శుభ్రంగా మార్చేస్తుంటాడు.

సూర్యనారాయణ్ గారు  రైతు కుటుంబంలో జన్మించారు.  ఆయనకు చెట్లు నాటడం అంటే చెప్పలేనంత ఇష్టం.  వాటిని సంరక్షించడం ఆయన బాధ్యతగా భావించేవాడు. చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి,  ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వయస్సులో, సూర్యనారాయణ్ ప్రతిరోజూ చేతిలో చీపురు పట్టుకుని తన పనిని కొనసాగిస్తూ కనిపిస్తాడు.

ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ తాత కృషి మరింత పెరుగుతుంది. 2001 నుండి వర్షాకాలంలో కూడా అవిశ్రాంతంగా వీధులు ఊడ్చడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం,  ఎండిన ఆకులను కంపోస్ట్ చేయడం చేస్తున్నాడు. వర్షాకాలంలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి, డ్రైనేజీ పొంగిపోకుండా నిరోధించడానికి  అదనపు కృషి చేస్తున్నాడు. తను చేసే పనిని చాలా అంకిత భావంతో చేస్తాడు.  సంవత్సరాల నుండి  తను చేస్తున్న పని మధ్యలో గాయాలు అయినా సరే వెనకడుగు వేయడం లేదు.  తన భార్య మద్దతు ఉండటంతో తాను చేసే పని చిన్నది పెద్దది అనే తేడా లేకుండా మనసు పెట్టి చేయగలుగుతున్నానని, తనకు ఆ పని చేయడం ఇష్టం కాబట్టే చేస్తున్నానని ఎంతో సంతోషంగా అంటున్నాడు.   ఈ స్వచ్చంద సేవకుడికి లాల్ సలాం చెప్పాల్సిందే..!


                         *రూపశ్రీ.