మహిళలూ జాగ్రత్త!!

ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన ఆడపిల్ల గురించి దారుణాలు వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఆ దుర్ఘటన తాలూకూ అనుభవాల నుండి ఏదో ఒక చట్టాన్ని చేస్తూనే ఉంది. ఎన్ని చట్టాలు చేసినా ఆడపిల్లల మీద అమానుష సంఘటనలు మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో గొంతు చించుకొని ఎంత ఆవేదన వెలిబుచ్చినా అదంతా గాలిగీతంలా క్షణానికే మాయమవుతోంది. మరి ఇలాంటప్పుడు ఆడపిల్లలు బయటకు ఎక్కువ వెల్లకపోవడం మంచిదని చాలామంది చెబుతారు. కానీ భవిష్యత్తును వదులుకోవడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది మరి. అయితే అమ్మాయి బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి ఇంటికి రావడం అనేది ప్రతి తల్లిదండ్రిలో ప్రతీరోజును ఒక భయానక కాలంగా మార్చేస్తోంది. అలా కాకుండా తమ ఇష్టాలను లక్ష్యాలను  ఏమాత్రం విడిచిపెట్టకుండా, ఇంట్లో వాళ్లకు భరోసా ఇవ్వగలిగే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఎలాంటి చీకు చింతా ఉండవు.

దగ్గరగా…. దగ్గరగా…..

చదువుకునే పిల్లల నుండి ఉద్యోగం చేసే అమ్మాయిలు, మధ్యవయసు ఆడవాళ్లు ఇలా అందరూ చూసుకోవాల్సిన మొదటి ఎంపిక స్కూల్ లేదా కాలేజి లేదా ఆఫీసు వంటివి దగ్గరలో ఉండేలా వాటికి దగ్గరలో ఇల్లు, లేదా హాస్టల్ చూసుకోవడం. దీనివల్ల అక్కడ కాస్త ఆలస్యం అయినా ఇంటికి చేరుకునే సమయం తక్కువే కాబట్టి పెద్దగా భయపడనవసరం లేదు. 

కొంచం టచ్ లో ఉంటే బాగుంటుంది

దూరబార ప్రయాణాలు, సిటీ లోనే కాలేజ్ లు, స్నేహితులతో ఎక్కడికైనా దూరం వెళ్లడం వంటి సందర్భాలలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అంతేకాదు రాత్రి పూట తప్పనిసరి అయి ఆటో లు, క్యాబ్ లు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా లైవ్ లొకేషన్ షేర్ చేయాలి.

నమ్మకానికి ఆమడదురం

ఈ కాలంలో ఎవరిని నమ్ముతాం పూర్తిగా. కాలమే మారిపోతూ ఉంటుంది అలాంటపుడు మనుషులు మారకుండా ఉంటారా. అలాగని ఎప్పుడూ అనుమానంతో ఉండమని కాదు. అతినమ్మకం ఉండకూడదు అని. కాబట్టి ఎవరిని వారు పూర్తి విమర్శ చేసుకుని అప్పుడు అవతలి వారిని నమ్మాలి. ఏదో మోహమాటానికి పోయి సమస్యలలో చిక్కుకోవద్దు సుమా!!

స్వీయ రక్షణే కొండంత భరోసా

ఇప్పటికాలం ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ వంటి విద్యలు నేర్పడం వల్ల శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా ప్రమాదంలో ఉన్నపుడు అవే కొండంత భరోసా ఇస్తూ తమని తాము కాపాడుకునేలా చేస్తాయి.  అంతే కాదండోయ్ ఆడపిల్లలు ఆటలలో చురుగ్గా ఉంటే వారు ఎంతో దృఢంగా తయారవుతారు. అదే వారికి స్వీయ రక్షణ గా తోడ్పడుతుంది కూడా.

డోంట్ టచ్….

ఇప్పట్లో మొబైల్స్ ను చాలా సులువుగా హాక్ చేసేస్తారు. వాటి ద్వారా, బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే కెమెరా ఆక్టివేట్ చేసి అమ్మయిల ఫొటోస్, వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజుతూ పైశాచికానందం పొందుతుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా  తక్కువగా బయటపడుతుంటాయి. కాబట్టి తెలియని వాళ్లకు ఫోన్ ఇవ్వడం వంటివి చేయకూడదు. ఎవరైనా మీ వస్తువులను ముట్టడానికి ప్రయత్నం చేసినా సున్నితంగా డోంట్ టచ్ అని చెప్పేయండి. ఒకవేళ హెల్పింగ్ నేచర్ ఉన్నా తెలియని వ్యక్తులు అడిగినప్పుడు ఒక చిన్నపాటి కీప్యాడ్ మొబైల్ ఇవ్వడం ఉత్తమం. 

సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో చెడు కూడా చేస్తుంది. కాబట్టి తెలివిగా దాన్ని ఉపయోగించుకోగలగాలి. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ లాంటివి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. రాత్రి పూట ప్రయాణాలలో వీలైనంతవరకు నిద్రను అవాయిడ్ చేయాలి. ప్రయాణం చేసి బస్ లేదా ట్రైన్ వంటివి దిగే  సమయానికి ఆయా స్టాప్ లలో కుటుంబసభ్యులు లేదా స్నేహితులు, లేదా చుట్టాలు ఇలా ఎవరో ఒకరు అక్కడికి చేసురుకుని రిసీవ్ చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి. 

దేన్నీ నిర్లక్ష్యంగా చూడద్దు. అమ్మాయిలు బయటకు వెళ్లినప్పటి నుండి తిరిగి ఇంటికి చేరుకునేదాకా స్పృహతో ఉండాలి. పరిసరాలను గమనిస్తూ ఉండాలి. 

కాలంతో పాటు ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మహిళల విషయంలో సమాజం దిగజారిపోతోంది. కాబట్టి జగరూకత ఎంతైనా అవసరం.

◆ వెంకటేష్ పువ్వాడ