నేటి బాలలే రేపటి దేశముదుర్లు

మన తెలుగు క్యాలెండర్ లో ఎంతో గొప్పధనం ఉంది. వారాలు, తిథులు, నక్షత్రాలు, నెలలు, ఋతువులు, పండుగలు, సంవత్సరాలు ఇలా ఎన్నో. పిల్లల భాషా సామర్త్యానికి వీటన్నింటినీ ప్రాథమికంగా నేర్పడం మొదటి మెట్టు అని నమ్మేవాళ్ళు ఒకప్పుడు. తల్లిదండ్రుల నుండి బడిలో ఉపాధ్యాయుల వరకు అందరూ కూడా వీటిని బోధించేవారు. అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు అనే  పెద్దల సామేత ఇప్పుడు నిజమైందని అనుకోవచ్చు. అవును మరి పిల్లల విషయంలో, ముఖ్యంగా చదువు విషయంలో ఎటు పోతోంది ఈ సమాజం అని ప్రశ్నించుకోవలసి వస్తోంది.

ఏమి నేర్పుతున్నారు అసలు??

ఈకాలంలో పిల్లలు పుట్టగానే వారిని ఏ కోర్స్ లో చేర్పించాలి, ఏ ఫీల్డ్ లో తోయాలి, ఏ వృత్తిలో చూడాలి వంటివి నిర్ణయం జరిగిపోతున్నాయంటే పిల్లల మీద ఎంత ఒత్తిడి పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు అమ్మా, నాన్నా అనే మాటలు వదిలి మామ్, డాడ్ అనే మాటలే పిల్లల తొలిపలుకులు  అవుతుంటే తెలుగు వారిగా సిగ్గుపడాలి కదా అనిపిస్తుంది. 

నర్సరీలు, ఎల్.కె.జీ లు, యు. కె.జీ లు వీటితోనే ర్యాంకుల గోల మొదలై, ప్రాథమిక తరగతిలో ప్రాథమికోన్నత చఫువులు, ప్రాథమికోన్నత తరగతిలో ఐటి చదువులు, ఇలా అంతకంతకూ పిల్లల మానసిక సామర్త్యాన్ని అర్థం చేసుకోకుండా చదువుల పట్టిక పెంచుకుంటూ, తమ పిల్లలు తొందరగా అన్ని నేర్చుకుని గొప్ప ఉద్యోగాలలో చేరిపోవాలని తల్లిదండ్రులు, పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకుంటే తమ విద్యాసంస్థలకు మరింత ఆర్థిక స్థాయి మరియు పేరు కూడా మెరుగవుతుందని విద్యాసంస్థలు ఇలా ఆలోచిస్తూ పిల్లల గురించి మాత్రం కొద్దిగా కూడా ఆలోచించడం లేదు. 

ఏమి జరుగుతోంది??

ఈ విపరీత ధోరణి వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగి చదువు అంటేనే విరక్తి కలిగేలా తయారవుతున్నారు. చదువును పోటీగా తీసుకోవడం వల్ల దాన్ని ఆస్వాదించలేకపోతున్నారు.  ప్రతినిత్యం టార్గెట్లు, ర్యాంకుల వలయంలో నలిగిపోతూ, చదవకపోతే ఎదురయ్యే పనిష్మెంట్లు, తల్లిదండ్రుల నుండి ఎదుర్కోవలసిన తిట్లు మొదలైన వాటికి భయపడి కృత్రిమంగా పుస్తకాలలో విషయాన్ని చదువుతూ, పరీక్షలు రాస్తూ, ర్యాంకులు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ కృత్రిమత్వం అంతా కలగలిసి వారి జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తోంది. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కనుమరుగై ఎలాగైతే పుస్తకాలను యాంత్రికంగా తిరిగేశారో అదే విధంగా మనుషుల విషయంలో కూడా చేస్తున్నారు. ఫలితంగా మనుషుల మధ్య బాంధవ్యాలు చాలా పెళుసుగా ఉంటున్నాయి. చిన్నచిన్న గొడవలకే బంధాలను తెంచుకోవడానికి సిద్ధమైపోతున్నారు. 

ఏమి చేయాలి??

పిల్లలకు చిన్నతనం నుండే జీవిత విలువలు తెలిసేలా చేయాలి. పిల్లలకు చదువు ముఖ్యమే, ఇంగ్లీష్ భాష ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమే. అయితే ఇక్కడ గుర్తించాల్సింది మాతృభాషలో పిల్లల మానసిక నైపుణ్యం పదింతలు మెరుగ్గా పెంపొందుతుంది. మాతృభాషలో ఉన్న జీవం, అందులో అర్థమైన నవరసాలు వేరే ఇతర భాషలో పిల్లలు గ్రహించలేరు. దీనివల్ల పిల్లల్లో ఒకానొక ఆస్వాదించే గుణాన్ని చిన్నతనంలోనే కోల్పోతారు. 

పిల్లలు ఎన్ని భాషలలో చదువుకున్నా ఇంట్లో మాతృభాషలో మాట్లాడేలా అలవాటు చేయాలి.

చాలామంది తల్లిదండ్రులకు పిల్లలు చిన్నతనంలోనే మొబైల్స్, గాడ్జెట్స్, సిస్టం ఆపరేట్ చేస్తుంటే చాలా గొప్పగా సంబరంగా చెప్పుకుంటారు. దానివల్ల పిల్లలకు ఎదురయ్యే చెడు గురించి పెద్దలు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలి.

కళల ద్వారా పిల్లలు తొందరగా నేర్చుకునే నైపుణ్యాన్ని సాదించగలుగుతాడు. పిల్లలను సంప్రదాయ ఆటల్లో మరియు, స్కిల్స్ పెంపొందెందుకు ఉపయోగపడే ఆటలలో ప్రోత్సహించాలి.

కథలు చెప్పడం, కథలు చెప్పించడం, పిల్లలతో చిన్న చిన్న సంఘటనలు రాయించడం ఇలాంటివి చేయడం వల్ల పిల్లల దృష్టి విస్తృతం అవుతుంది.

చివరగా పిల్లల విషయంలో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్త పిల్లలను పిల్లలుగా ఉండనివ్వాలి. బాల్యాన్ని ఆస్వాదించేలా చేయాలి. ఎప్పుడైతే సంపూర్ణ బాల్యాన్ని వాళ్లకు అందివ్వగలుగుతామో వాళ్ళు సంపూర్ణ మేధస్సును పెంపొందించుకుని, ఉపయోగించుకోగలుగుతారు.

◆వెంకటేష్ పువ్వాడ