మనసు తెరచి హృదయానికి వైద్యం చేద్దాం!!

సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే గా నమోదు అయింది. అయితే ఈరోజున ఇప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవడం కాసింత బాధగా అనిపిస్తుంది. కారణం గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి ఏడాదికి పెరుగుతూ పోవడమే. గత రెండు సంవత్సరాల నుండి అయితే ఈ గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. కారణం మహమ్మారి కరోనా!!

ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 18.6 మిలియన్ల మంది గుండె సంబంధ సమస్యల వల్ల మరణిస్తున్నారంటే దాని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మనుషుల జీవన సరళిలో అలవాట్లు అయిన ధూమపానం, మద్యపానం, మధుమేహం, ఊబకాయం వంటివి కాకుండా బయటి నుండి ఎదురయ్యే వాయుకాలుష్యం వంటివి కూడా గుండె సమస్యలకు కారణం అవుతాయి. 

సమస్య ఎక్కడ??

జీవన శైలిని మారుతున్న కాలానికి తగ్గట్టు మార్చుకుంటే పర్వాలేదు కానీ ఆ మారుతున్న కాలంతో పూర్తిగా లీనం చేస్తే శరీరానికి నష్టం కలుగుతుంది. అలాంటివే ఆరోగ్య సమస్యలు. మానవ శరీరానికి కొన్ని నియమాలు, మరికొన్ని మార్గనిర్దేశకాలు ఎప్పటి నుండో ఉన్నాయి. అయితే వాటిని మూలన పడేసి కాలంతో పరిగెడుతూ కాలం తెచ్చే మార్పులకు శరీరాన్ని మౌల్డ్ చేస్తే శరీరం ఇబ్బంది పడక ఇంకేమి చేస్తుంది. మనిషి మానసికంగా కాలానికి తగ్గట్టు మారాలి. శారీరకంగా ఒక పటిష్టమైన వలయాన్ని నిర్మించుకోవాలి. ఇది ఎవరు గుర్తించడంలేదు కాబట్టే ప్రస్తుత కాలంలో శరీరం జబ్బులకు లోనవుతోంది. వాటిలో గుండె సమస్య కూడా ఒకటి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, పనులు చేయకపోవడం, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం మొదటి కారణాలు.

పరిష్కారాలు ఏమిటి??

గుండె సంబంధ సమస్యలకు మొదటి పరిష్కారం మానసిక ప్రశాంతత. కానీ మనుషులు మానసికంగా కష్టపడుతూ, శారీరకంగా నష్టపోతున్నారు. శారీరకంగా కాశగాపడి, మానసికంగా బలపడటం మంచి మార్గం. అలాగని చాలా కష్టం చేసేయ్యక్కర్లేదు. గుండె సంబంధ సమస్యలు లేనివాళ్ళు శారీరక కష్టం ఎక్కువ చేస్తే ఆ సమస్యలు ఏవి దరిదాపుల్లోకి రావు. 

ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల ఒక నిశ్చింత. సినిమాలు, పార్టీలకు ఖర్చు పెట్టె డబ్బును ఆరోగ్యం కోసం ఖర్చు చేయవచ్చు కదా!! అందుకే చెకప్ అనేది ముఖ్యమైనది. ఈ కరోనా కాలంలో చెకప్ లకు వెళ్లలేక చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళు ఆన్లైన్ లో డాక్టర్ ను కన్సల్ట్ అవ్వడం ఉత్తమం. ఇంటర్నెట్ సౌకర్యం లేనివాళ్ళు, అవగాహన లేనివాళ్ళు చుట్టుపక్కల చిన్న క్లినిక్ లలో ఉన్న డాక్టర్ల సహాయంతో ఆన్లైన్ కన్సల్ట్ అవ్వచ్చు.

కరోనా వల్ల ఎవరితో ఎక్కువగా కలవలేకపోతున్నామని బెంగ అక్కర్లేదు. మొబైల్ లోనే కాన్ఫెరెన్సు కాల్స్, వీడియో కాల్స్ వంటి వాటితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ స్నేహితులు మరియు బంధువుల నుండి భరోసా పొందొచ్చు.

తిండి, నిద్ర, వ్యాయామం చాలా ముఖ్యమైనవి. ప్రతి రోజు వీటి విషయంలో జాగ్రత్తలు అవసరం ఏమి తింటున్నాం అనే విషయం నుండి, నిద్ర, వ్యాయామం విషయంలో ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవాలి. 

ఇష్టమైన పనిని ఇష్టంగా చేయడం వల్ల మనసుకు హయిగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచే మార్గమిది. అనవసర విషయాలు నెత్తిమీదకు వేసుకుని ప్రశాంతతను పోగొట్టుకోకూడదు.

"Heart donation is the promotion of humanity" 

ప్రతి సంవత్సరం గుండె సంబంధ సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్య 18.6 మిలియన్ల మంది అయితే అన్ని కారణాల వల్ల ప్రతి సంవత్సరం మరణిస్తున్నవారి సంఖ్య 60 మిలియన్లుగా నమోదు అయింది. దీన్ని బట్టి చూస్తే యాక్సిడెంట్లు, ఆకస్మిక మరణాలు వంటి వాటి ద్వారా మరణించే వారి గుండెను దానం చేయడం వల్ల 18.6 మిలియన్ల మరణాల్లో కనీసం ఒక్కరి ప్రాణాన్ని రక్షించగలిగినా ఈ సమాజంలో మానవత్వపు ఛాయలను పెంపొందించవచ్చు. రేపటి తరానికి మనం ఇవ్వగలిగే అతిగొప్ప బహుమతి కూడా ఇలాంటి మనవత్వపు విలువల ప్రాముఖ్యత తెలియజేయడమే.

కాబట్టి బతికున్నతవరకు గుండెను కాపడుకోవడమే కాదు, చనిపోయిన తరువాత గుండెను దానం చేయడం వల్ల కూడా మళ్లీ బతికే అవకాశం పుష్కలంగా ఉంది సుమా!!

◆ వెంకటేష్ పువ్వాడ