పేపర్ లీక్ కు, మాల్ ప్రాక్టీస్ కు తేడా లెలీదా?
posted on Apr 7, 2023 11:58AM
టెన్త్ పరీక్షా పత్రం లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ శుక్రవారం (ఏప్రిల్ 7) బెయిలుపై విడుదలయ్యారు. ఆయనకు కోర్టు గురువారం (ఏప్రిల్6) బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. అలాగే తన అరెస్టు విషయంలో మీడియాకు అవాస్తవాలు చెప్పారంటూ సీపీ రంగనాథ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీకీ ప్రశ్నపత్రం లీక్ కు, మాల్ ప్రాక్టీస్ కు కూడా తేడా తెలియదని దుయ్యబట్టారు. ఇక తన మీడియా సమావేశంలో బండి సంజయ్ ప్రధానంగా మూడు డిమాండ్లను సర్కార్ ముందు ఉంచారు. కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ, ఆ పేపర్ల లీకేజీ వ్యవహారం వల్ల నష్టపోయిన యువతకు ఒక్కొక్కరికి రూ.లక్ష భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక బండి సంజయ్ తన అరెస్టుపై వరంగల్ సీపీ చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని పోలీసు టోపీపై ఉండే మూడు సింహాలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
పేపర్ల లీక్ తో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేయడానికి సిద్ధమేనన్నారు. అయినా టెన్త్ హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్రించారు. తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారో చెప్పాలన్నారు. అలాగే కేసీఆర్ కుటుంబంపై కూడా విమర్శలు గుప్పించారు. అసలు కేసీఆర్ కుటుంబమే లిక్కర్, లీకర్ల కుటుంబమని దుయ్యబట్టారు.
ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ లో ఎవరో ఫార్వార్డ్ చేస్తే తనకేం సంబంధం అన్నారు. టెన్త్ పేపర్ లీక్‌పై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసే దమ్ముందా అని ప్రభుత్వానికి బండి సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ ను బర్తరఫ్ చేసే దాకా ఊరుకునేది లేదన్నారు. వరంగల్ గడ్డపై భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామన్నారు. సింగరేణిలో 51శాతం వాటా ప్రభుత్వానిదని, ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్రానికి ఎక్కడిదన్నారు.