హైదరాబాద్ కు మోడీ.. కేసీఆర్ మళ్లీ మొహం చాటేస్తారా?
posted on Apr 7, 2023 11:39AM
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ( ఏప్రిల్ 8) తెలంగాణ పర్యటనకు రానున్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో సికిందరాబాద్, తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు. ఇది ప్రధాని అధికారిక పర్యటన కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో మధ్యాహ్నం 12.30 నుంచి 12.37 వరకు ఏడు నిముషాల సమయాన్ని కేసీఆర్ ప్రసంగానికి కేటాయించారు. అనంతరం అరగంట సేపు మోడీ ప్రసంగిస్తారు. కార్యక్రమం షెడ్యూలు బానే ఉంది. అసలీ కార్యక్మానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరౌతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం చెప్పలేదు. అలా ఒక సారి కాదు రెండు మూడు సార్లు జరిగింది.
గతంలో సరిగ్గా ప్రధాని రాష్ట్ర పర్యటన సమయంలో కేసీఆర్ పనిగట్టుకుని మరీ దేశ వ్యాప్త పర్యటన పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన మోడీ రాష్ట్ర పర్యటన పూర్తికాగానే.. కేసీఆర్ తన దేశ వ్యాప్త పర్యటన షెడ్యూల్ ను కుదించుకుని మరీ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. ప్రొటో కాల్ ప్రకారం ప్రధాని అధికారిక పర్యటలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకావాల్సి ఉంటుంది. కేసీఆర్ గత మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ను పట్టించుకోలేదు. హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో అప్పట్లో మోడీ పాల్లొన్నారు. ప్రొటో కాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి. అయినా కేసీఆర్ డుమ్మా కొట్టారు.
హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ కేసీఆర్ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అదే విధంగా మోడీ ఇక్రిశాట్ లో పాల్గొన్న కార్యక్రమానికీ కేసీఆర్ డుమ్మా కొట్టారు. మొత్తం మీద కేంద్రం, తెరాస మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచీ కేసీఆర్ మోడీకి ఎదురు పడటానికి ఇసుమంతైనా సుముఖత చూపడం లేదు. మొత్తం మీద ఉద్దేశ పూర్వకంగానే కేసీఆర్ మోడీకి ఎదురుపడకుండా అవాయిడ్ చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషించారు.
ఇక ఇప్పడు శనివారం (ఏప్రిల్8) కూడా కేసీఆర్ మోడీకి ఎదురు పడే అవకాశాలు ఇసుమంతైనా లేవనే అంటున్నారు. మోడీ పర్యటన షెడ్యూల్ లో కేసీఆర్ హాజరౌతున్నట్లుగా ఉన్నప్పటికీ, ఆయనకు ఆహ్వానం పంపినప్పటికీ కేసీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ అరెస్టుతో బీఆర్ఎస్, బీజేపీల మద్య మరోసారి పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు, అలాగే బెయిలుపై బండి విడుదలైన సందర్భంగా ఆయన కేటీఆర్, కవితల అరెస్టు తధ్యం అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ మోడీ సభలో ప్రసంగించే అవకాశాలు దాదాపు మృగ్యమని అంటున్నారు. అలా కాకుండా ఒక వేళ ప్రొటో కాల్ ను పాటించి కేసీఆర్ మోడీ పర్యటనలో కనిపిస్తే మాత్రం కచ్చితంగా ఆది రాజకీయంగా సంచలనమే ఔతుందని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే ఏ విధంగా చూసినా అలాంటి సంచలనాలకు అవకాశం లేదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే కేసీఆర్ మోడీ సభకు హాజరైనా కాకపోయినా మాత్రం విమర్శలను ఎదుర్కొన వలసి వస్తుందని అంటున్నారు. కేసీఆర్ హాజరు కాకపోతే.. ప్రొటో కాల్ ఉల్లంఘించారని బీజేపీ విమర్శిస్తుంది. హాజరైతే.. బీజేపీతో కుమ్మక్కైపోయారు, బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. అంతే కాకుండా కేసీఆర్ మోడీ పర్యటనలో పాల్గొంటే.. జాతీయ స్థాయిలో పలుచన అయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారన్న ఉత్కంఠ మాత్రం రాజకీయ సర్కిల్స్ లో నెలకొని ఉంది.