దత్తన్న వారసురాలు విజయలక్షి ... అలయ్‌ బలయ్‌ తో అరంగేట్రం 

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎక్కాడున్నా, ఏ పదవిలో ఉన్నా, ఆయన మనసెప్పుడు హైదరాబాద్’లోనే ఉంటుంది. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా హైదరాబద్’లోనే ఉన్నారు.హైదరాబాద్ మంత్రి అన్నా, హైదరాబాద్’కే మంత్రి అన్నా ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. హైదరాబాద్’తో ఆయనకున్న అనుబంధం అటువంటిది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్’ గా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన దత్తాత్రేయ సుదీర్ఘ కాలం పాటు, సంఘ్ బాధ్యతలను నిర్వర్తించారు. దివిసీమ తుపాను సమయంలో సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉండి పునర్నిర్మాణ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

రాజకీయాలోనూ దత్తాత్రేయ తమ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి వాడుగా జనామోదం పొందారు.దత్తన్నగా ముద్ర వేసుకున్నారు.రాజాకేయ విభేదాలున్నా అన్ని పార్టీలలో ఆయనకు ఆత్మీయ మిత్రులున్నారు. ఆ ఆత్మీయ బంధం ప్రతిబింబమే ... ఇంచుమించుగా రెండు దశాబ్దాలుగా ఆయన ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా  నిర్వహిస్తున్న అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనం. ప్రధానమంత్రి నరేందర్ మోడీ కూడా ప్రతి ఏటా దసరా అనంతరం బండారు దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. ‘అలయ్‌ బలయ్‌’ వంటి కర్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యం, సమానత్వాన్ని పెంచుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

ప్రతి ఏటా విజయ దశమి తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రజల్లో పండుగ వాతావరణాన్ని నింపుతుందని, అసాధారణ స్ఫూర్తిని చాటుతుందన్నారు.  ఈ సంవత్సరం ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహించారు. విజయలక్ష్మి ఆయన వారసత్వాన్ని ఘనంగా అందిపుచ్చుకున్నారు. జలవిహార్’లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 

ఇప్పుడు సహజంగానే దత్తన్న కూతురు, రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినట్లేనా ? అన్న చర్చ రాజాకేయ వర్గాలలో మొదలైంది,  అయితే, ఇప్పటికే బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్న విజయలక్షి, తాను ఇప్పటికే బిజెపి పార్టీలో ఉన్నానని.. పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్దమని అన్నారు. నిజానికి, చాలా కాలంగా ఆమె పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇక అలయ్ బలయ్ తన ఆధ్వర్యంలో నిర్వహించడం బాధ్యతగా ఫీలవుతున్నానని చెప్పారు విజయలక్ష్మి. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రముఖులు వచ్చి పాల్గొనడం మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. నాన్నగారు తీసుకొచ్చిన అలాయ్ బలాయ్ సంప్రదాయాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తానని తెలిపారు. ఆయన వారసురాలిగా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమ, ఆప్యాయతల సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించానని తెలిపారు.