కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి ఫిక‌ర్‌.. అందుకేనా 10ల‌క్ష‌ల మందితో వ‌రంగ‌ల్ మీటింగ్‌?

న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో విప‌క్షాల‌కు దిమ్మ‌తిరిగేలా 10 ల‌క్ష‌ల మందితో తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌. ప్ర‌తీ గ్రామానికి ఓ బ‌స్సు ఏర్పాటు చేసి.. 20వేల బ‌స్సుల్లో స‌భ‌కు జ‌నం త‌ర‌లింపు. స‌భ నిర్వ‌హ‌న బాధ్య‌త‌లు మంత్రి కేటీఆర్‌కు అప్ప‌గింత‌. జ‌న స‌మీక‌ర‌ణ‌, స‌భ ఏర్పాట్ల‌పై సోమ‌వారం నుంచి తెలంగాణ భ‌వ‌న్‌లో రోజులు 20 నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తో కేటీఆర్‌, కేశ‌వ‌రావు స‌మావేశాలు. ఇదీ గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ర‌చించిన స‌రికొత్త స‌భా వ్యూహం. ఇంత‌కీ ఉన్న‌ట్టుండి కేసీఆర్‌ ఇంత హ‌డావుడి ఎందుకు చేస్తున్న‌ట్టు? 10 ల‌క్ష‌ల మందితో స‌భ పెట్టాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? వ‌రంగ‌ల్‌లోనే ఎందుకు పెడుతున్న‌ట్టు? ఎల‌క్ష‌న్ల సీజ‌న్ కాకున్నా, స‌రైన‌ సంద‌ర్భ‌మూ లేకున్నా.. భారీ బ‌హిరంగ‌ స‌భ ఆవ‌శ్య‌క‌త ఏంటి? ఇలా ప్ర‌శ్న‌ల‌న్నిటికీ ఒక‌టే స‌మాధానం.. రేవంత్‌రెడ్డి.

అవును, సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి ఫిక‌ర్ ప‌ట్టుకున్న‌ట్టుంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్వ‌హించిన వ‌రుస బ‌హిరంగ స‌భ‌లు సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. తెలంగాణ‌లో ఏ దిక్కున స‌భ పెట్టిన‌.. జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చారు. ల‌క్ష‌లాది మందితో స‌భా ప్రాంగ‌ణం కిక్కిరిసిపోయింది. వ‌ర్షం ప‌డినా, ఎంత ఆల‌స్య‌మైనా.. ఏ ఒక్క‌రూ క‌ద‌ల‌కుండా రేవంత్‌రెడ్డి స్పీచ్‌ను అంతా చెవులురిక్క‌రించి వినేవారు. ఆ స‌భా వేదిక‌లపై నుంచి సీఎం కేసీఆర్‌కు ప‌దే ప‌దే స‌వాళ్లు విసిరారు రేవంత్‌. స‌భ‌కు వ‌చ్చిన జ‌నాల‌ను లెక్కేసుకోండి.. ల‌క్ష‌కు ఒక్క‌రు త‌క్కువున్నా.. రెట్టింపు సంఖ్య‌తో మ‌ళ్లీ స‌భ పెడతానంటూ ఛాలెంజ్ చేసేవారు. అలా రేవంత్‌రెడ్డి స‌భ‌ల‌కు అనూహ్యంగా జ‌నం త‌ర‌లిరావ‌డం.. అవ‌న్నీ బ్ర‌హ్మాండంగా హిట్ కావ‌డం చూసి.. తెలంగాణ‌కు రేవంత్‌రెడ్డీ ఆశాకిర‌ణం అనే మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లిపోయింది. రేవంత్ స‌భ‌ల గురించి జ‌నం రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చించుకున్నారు. కేసీఆర్‌కు క‌రెక్ట్ మొగుడు రేవంతేనంటూ ప్ర‌చారం జ‌రిగిపోయింది. ఈ ప‌రిణామం గులాబీ బాస్‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేసింది. క‌ట్ చేస్తే.. న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో 10 ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌కు స్కెచ్ వేశారు కేసీఆర్‌. 

ఇన్నాళ్లూ కేవ‌లం హుజురాబాద్ ఎన్నిక‌ల‌పైనే ఫోక‌స్ పెట్టారు కేసీఆర్‌. ఈట‌ల‌ను ఎలాగైనా ఓడించాల‌ని స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. అయినా, స‌ర్వేల ఫ‌లితం అంతంత మాత్రంగా ఉందంటున్నారు. ద‌ళిత బంధు తీసుకొచ్చినా.. హుజురాబాద్‌లో ద‌ళిత‌ కుటుంబానికి 10 ల‌క్ష‌లు పంచుతున్నా.. ఆ క్రెడిట్ కేసీఆర్ అకౌంట్లో కాకుండా.. ఈట‌ల ఖాతాలో ప‌డుతుంద‌ని కేసీఆర్ అస్స‌లు ఊహించ‌లేక‌పోయారు. అందుకే, హుజురాబాద్ ఎన్నిక‌ల‌కు రెండు వారాల ముందు.. హ‌డావుడిగా పార్టీ మీటింగ్ పెట్టి.. మ‌న‌దే గెలుపంటూ స‌ర్వేలు చెబుతున్నాయంటూ శ్రేణుల్లో ధైర్యం నూరిపోసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌నిలో ప‌నిగా.. ప్ర‌జ‌ల అటెన్ష‌న్ హుజురాబాద్ నుంచి షిఫ్ట్ చేసేందుకు వ‌రంగ‌ల్ స‌భ‌ను ప్ర‌క‌టించార‌ని అంటున్నారు. బ‌హిరంగ స‌భ‌తో తాత్కాలిక టార్గెట్ హుజురాబాద్ అయినా.. అస‌లు ల‌క్ష్యం మాత్రం రేవంత్‌రెడ్డినే.

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ద‌ళిత-గిరిజ‌న దండోరా స‌భ‌ల‌తో ల‌క్ష‌లాది మందితో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ చేశారు. ప్ర‌జ‌లంతా రేవంత్ వెంటే ఉన్నార‌నేలా ఆ స‌భ‌లు స‌క్సెస్ కావ‌డంతో కేసీఆర్ ఉలిక్కిప‌డ్డారు. రేవంత్ స‌భ‌ల‌కు ధీటుగా.. వ‌రంగ‌ల్‌లో ఒకే ఒక స‌భ‌తో కాంగ్రెస్‌కు కౌంట‌ర్ ఇవ్వాల‌నేది కేసీఆర్ వ్యూహంలా క‌న‌బ‌డుతోంది. రేవంత్‌రెడ్డి ల‌క్ష-రెండు ల‌క్ష‌ల‌తో స‌భ‌లు నిర్వ‌హిస్తే.. గులాబీ బాస్ మాత్రం ఏకంగా 10 ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించి.. విప‌క్షాల‌కు దిమ్మ‌తిరిగే మెసేజ్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. 

తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌కు వ‌రంగ‌ల్‌ను ఎంచుకోవ‌డ‌మూ వ్యూహాత్మ‌క‌మే అంటున్నారు. రేవంత్‌రెడ్డి ద‌ళిత‌-గిరిజ‌న దండోరా స‌భ‌ల్లో భాగంగా వ‌రంగ‌ల్‌లో 10 ల‌క్ష‌ల మందితో భారీ స‌భ పెట్టి.. రాహుల్‌గాంధీని ర‌ప్పించాల‌ని భావించినా అది సాధ్యం కాలేదు. అందుకే, రేవంత్‌రెడ్డి పెట్ట‌లేక పోయిన వ‌రంగ‌ల్‌లో 10 ల‌క్ష‌ల మందితో స‌భ నిర్వ‌హించి స‌త్తా చాటాల‌ని కేసీఆర్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ అదే వ‌రంగ‌ల్‌లో భారీ స‌భ పెట్టి స‌క్సెస్ చేసిన అనుభ‌వం కేసీఆర్‌కు ఉంది. అదే స్పూర్తితో రేవంత్‌రెడ్డికి స‌వాల్ విసిరేరా.. వ‌రంగ‌ల్‌ను వేదిక చేయ‌బోతున్నారు గులాబీ బాస్‌. 

అయితే, అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో కేసీఆర్ స‌ర్కారుపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో.. టీఆర్ఎస్ స‌భ‌కు 10 ల‌క్ష‌ల మంది వ‌స్తారా? అంటే డౌటే అంటున్నారు. అందుకే, ఊరికో బ‌స్సు వేసి.. న‌యానో, భ‌యానో జ‌నాల‌ను బ‌ల‌వంతంగా ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నార‌ని చెబుతున్నారు. ఇలానే, 2018లో హైద‌రాబాద్ శివారు కొంగ‌ర‌క‌ల‌న్‌లో ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పేరుతో 25 ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ అంటూ కేసీఆర్‌ ఊద‌ర‌గొట్టినా.. ఆ చారిత్ర‌క స‌భ‌కు ప‌ట్టుమ‌ని 4 ల‌క్ష‌ల మంది కూడా రాలేద‌నే విమ‌ర్శ ఉంది. ఇప్పుడూ అలానే 10 ల‌క్ష‌ల మందంటూ ఆర్భాటం చేసినా.. టీఆర్ఎస్ స‌భ‌కు రేవంత్‌రెడ్డి మీటింగ్‌కు వ‌చ్చినంత మంది వ‌చ్చినా స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని అప్పుడే సెటైర్లు ప‌డుతున్నాయి. వ‌రంగ‌ల్‌లో జ‌ర‌ప‌బోయే తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను ఏ మేర‌కు విజ‌య‌వంతం అవుతుందో చూడాలి మ‌రి...