కోడి.. కత్తి..జగన్
posted on Aug 1, 2023 5:43PM
కోడికత్తి కేసులో కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనీ.. ఇదంతా సమయం వృధా వ్యవహారమనీ ఎన్ఐఏ కుండ బద్దలు కొట్టేసింది. అయినా ఆ కేసును ఇప్పుడు విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదలీ అయ్యింది. కేసులో వాదనలు 80 శాతం పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీను గత ఐదేళ్లుగా బెయిలు కూడా దొరకకుండా జైళ్లో మగ్గుతున్నాడు.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించక తప్పదు.. మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఒంటిపై గాయాలకు కుట్లు వేసి బ్యాండేజీలు కట్టి హత్య కాదు గుండెపోటు అని నమ్మించడానికి విఫలయత్నం చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ గత నాలుగేళ్లుగా కనీసం అరెస్టు కాకుండా హాయిగా తిరుగుతున్నారు. అరెస్టు చేస్తాం అని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పింది. అయినా ఆయనకు ముందస్తు బెయిలు వచ్చింది. హత్యకు గురైన మాజీ మంత్రి, మాజీ ఎంపీ స్వయానా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాబాయ్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ.. జగన్ కు సోదరుడు. బెయిలు కోసం ఎన్ని సార్లు కోర్టును వేడుకున్నా, బెయిల్ దక్కదు. ఎందుకంటే ఎన్ఐఏ కేసు. ఉగ్రవాదుల కుట్రలను దర్యాప్తు చేసే జాతీయ దర్యాప్తు సంస్థ కోడి కత్తి కేసు విచారణ చేస్తున్నది. కోడి కత్తితో దాడికి గురైన వ్యక్తి అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం. దీంతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. కేసు పూర్తయితే నాడి దాడి గుట్టు రట్టౌతుందన్న భయమే ఇందుకు కారణమంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. కానీ అప్పట్లో అంటే కోడికత్తితో జగన్ పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడి వెనుక అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం కుట్ర ఉందంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న సాకుతో ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్నారు. అయితే అప్పట్లో కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేసిన అప్పటి విపక్ష నేత మాత్రం ఆ తరువాత జరిగిన ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయినా.. తనపై కుట్ర పూరితంగా జరిగిన హత్యాయత్నం కేసు త్వరిత గతిన విచారించి కుట్రదారులకు శిక్ష పడాలని కోరుకోవడం లేదు. కేసు దర్యాప్తు సజావుగా సాగి తీర్పు వెలువడితే.. రాజకీయంగా ఇబ్బందులు ఎదురౌతాయన్న జంకుతో దర్యాప్తునకు సహకరించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడిన జనుపల్లి శ్రీని తెలుగుదేశం సానుభూతి పరుడు కాదని ఎన్ఐఏ తేల్చేసింది.
పైపెచ్చు నిందితుడే స్వయంగా తాను వైసీపీ సానుభూతి పరుడిననీ, స్వల్పంగా గాయపడేలా దాడి చేస్తే సానుభూతి పవనాలు వీచి జగన్ పార్టీ విజయం సాధిస్తుందన్న ఉద్దేశంతోనే కోడి కత్తితో దాడి చేశాననీ దర్యాప్తులో విస్పష్టంగా చెప్పడం జరిగింది. సరే అదంతా పక్కన పెడితే బాధితుడిగా సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు విస్పష్టంగా ఆదేశించింది. ఆయన కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే తప్ప నిందితుడికి బెయిలు వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇంత క్రిస్టల్ క్లియర్ గా వివరాలు ఉన్నా ఎన్ఐఏ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందనీ, కోడి కత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ ఎన్ఐఏ కోర్టును కోరారు.
ఒక వైపు ఈ కేసులో కుట్ర కోణం లేదనీ లోతైన దర్యాప్తు అవసరం లేదనీ ఎన్ఐఏ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేసు విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదలీ అయ్యింది. దీనిపై జనుపల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో వాదనలు దాదాపుగా పూర్తి అయిన సమయంలో కేసు వేరే ప్రాంతానికి బదిలీ చేయడం సరికాదని అన్నారు. అయితే ఈ కేసు విషయంలో న్యాయం తన క్లయింట్ వైపే ఉందనీ ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామనీ స్పష్టం చేశారు. అయినా ఈ కేసు కొలిక్కి రావాలంటే జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనన్నారు.
ఇక విపక్షాలు మాత్రం కోడి కత్తి కేసులో కుట్రకోణం కాదు అసలా కేసే ఒక కుట్ర అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. వాస్తవానికి నాడు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై ఎలాంటి దాడీ జరగలేదనీ, కేవలం సానుభూతి కోసం ఆడిన నాటకం మాత్రమేనని అంటున్నాయి.