కలిశారు సరే.. ఏం మాట్లాడారు?

తెలుగుదేశం   అధినేత చంద్రబాబునాయుడు హస్తిన వెళ్లారు. అమిత్, జేపీ నడ్డాలతో సమవేశం అయ్యారు.  అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని వేరే చెప్పాల్సిన పని లేదు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు అమిత్షా తో బేటీ కావడం ఇదే తొలిసారి.  

అంతే కాకుండా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమంయంలో జరిగిన ఈ భేటీలో అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు చర్చలు పూర్తిగా రాజకీయపరమైనవేనని అనడంలో సందేహం లేదు.  అయితే అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు ఏం చర్చించి ఉంటారన్న విషయంలో రాజకీయ వర్గాలలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేరాల్సిందిగా కోరేందుకే బీజేపీ హై కమాండ్ చంద్రబాబును హస్తినకు పిలిచిందన్న వాదన రాజకీయవర్గాలలో గట్టిగా సాగుతోంది.  

అదే సమయంలో గత నాలుగేళ్లుగా ఏపీలో బీజేపీ అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన బలంగా జనంలోకి వెళ్లిపోయిందని గట్టిగా నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ సమయంలో ఏపీలో బీజేపీ పొత్తు, ఎన్డీయేలో చేరిక అంటే ప్రజలలో పలుచన అయ్యే అవకాశం ఉందన్న సంగతి ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని అంటున్నారు.  ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు సిద్ధపడితే అది పార్టీకి ప్రయోజనం చేకూర్చడం అటుంచి నష్టం చేకూర్చే అవకాశాలే అధికంగా ఉంటాయని చంబ్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం,  రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నా, కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నా.. ఇంత కాలం కేంద్రం వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలవడం, ఆర్థిక అరాచకత్వానికి మద్దతు ఇవ్వడాన్ని చంద్రబాబు ఆ సందర్భంగా వారి వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ తీరు వెనుక కూడా కేంద్రం ఉందన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెద్దగా ఉపయోగం ఉండదనీ, ముందు కేంద్రంలోని మోడీ సర్కార్ వైసీపీకి వ్యతిరేకం అన్న భావన కలిగేలా వ్యవహరించి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న తెలుగుదేశం, జనసేన పార్టీలతో క్షేత్ర స్థాయిలో కలిసి ఉద్యమాలలో పాల్గొంటే.. ఆ తరువాత పొత్తుల విషయం మాట్లాడుకోవచ్చని చంద్రబాబు అమిత్ షా నడ్డాలకు వివరించారని అంటున్నారు.

అన్నిటికీ మించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తు కంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీకి దూరం పాటించడం అవసరమనీ, అప్పుడు సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వివరించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు తెలుగుదేశం లోక్ సభలో అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అరాచకాలు, అక్రమాలకు పాల్పడకుండా   గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా చెప్పారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.

అన్నిటికీ మించి రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ వ్యతిరేకమన్న విషయాన్ని గట్టిగా చాటితే బీజేపీకి అవసరమైతే  తెలంగాణలో టీడీపీ నుంచి సహకారంఅందుతుందని కూడా చంద్రబాబు  అమిత్ షా నడ్డాలకు హామీ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు.  ఇవన్నీ పక్కన పెడితో అమిత్ షా, నడ్డాలతో బాబు భేటీపై ఏపీ సర్కార్ లో కలవరం విస్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ నేతలు, మంత్రులు ఈ భేటీపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ చూస్తుంటే  తమకు గతంలోలా కేంద్రం మద్దదు లభించదేమోన్న భయం వారిలో ప్రస్ఫుటమౌతోంది.