నోటితో వెక్కిరింపు.. నొసటితో పలకరింపు!

ఏపీలో బీజేపీ విచిత్ర విన్యాసాలు చేస్తోంది. అన్ని విధాలుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అధికార వైసీపీకి అడుగులకు మడుగులొత్తుతూనే.. చార్జిషీట్ల పేరుతో నామ్ కే వాస్తేగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఆ మాత్రమైనా చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ఒక్క శాతం ఓట్లు కూడా గాయబ్ అవుతాయన్న భయమే అందుకు కారణం.

జగన్ సర్కార్ పై ప్రజావ్యతిరేకతను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం.. అంటే హస్తినలో ఉన్న కమలం పార్టీ అధిష్ఠానం మీరు జగన్ సర్కార్ ను కనీసం తిట్టినట్లైనా చేయకపోతే ఎలా అని రాష్ట్ర నాయకత్వాన్ని  మందలించడమే   కారణం. అధిష్ఠానం కన్నెర్ర చేయడంతోనే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి వీసమెత్తు కూడా స్పందన రాకపోవడంతో వ్రతమూ చెడి.. ఫలమూ దక్కలేదన్నట్లుగా బీజేపీ రాష్ట్ర పార్టీ పరిస్థితి తయారైంది.  

ఈ నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా రాష్ట్రంలో  పర్యటించనున్నారు. వీరిలో హోంమంత్రి అమిత్ షా ఈ నెల 8న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో మోడీ తొమ్మిదేళ్ల  పాలన విజయాలపై ప్రసంగించనున్నారు.  

అలాగే పదో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో   బహిరంగసభలో ప్రసంగిస్తారు. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ పై దృష్టి పెట్టినట్లుగా ఏపీని పట్టించుకోవడం లేదు.  వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలు అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే జనసేనతో పొత్తు కొనసాగించేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉంటే ఉంటుంది.. లేకుంటే ఊడుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నది.  ఈ నేపథ్యంలోనే బీజేపీ  నాయకత్వం జగన్ సర్కార్ విషయంలో తిట్టినట్లు చేస్తూ.. వెనుక నుంచి  సహకారం అందిస్తోంది.