తెలుగుదేశంలోకి ట్రిపులార్?
posted on Jun 5, 2023 7:08AM
ట్రిపులార్ అంటే ఎవరో తెపుసు కదా... అవును.. ఎప్పుడూ వార్తల్లో ఉండే, రచ్చబండలో అధికార వైసీపీ సర్కార్ ను ఉతికేసే నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి గెలిచిన ఆయన ఆది నుంచీ అసమ్మతి ఎంపీగా ముద్ర వేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి క్రమం తప్పకుండా ప్రతిరోజూ రచ్చబండకు ఈడుస్తునే ఉన్నారు. సర్కార్ అగ్రహానికి గురయ్యారు. జగన్ రెడ్డి పోలీసులు ఆయనకు, థర్డ్ డిగ్రీ రుచి చూపించారు.నిజానికి చెప్పాలంటే అయన కథ చాలానే వుంది.
అదలా వుంచి ప్రస్తుతంలోకి వస్తే, ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతునట్లు తెలుస్తోంది. నిజానికి,గతంలో రఘురామ కృష్ణం రాజు.. బీజేపీకి సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో ఆయన కాషాయం కట్టేసినట్లేననే వార్తలు కూడా వచ్చాయి. అయితే కారాణాలు ఏవైనా ఆయన బీజేపీలో చేరలేదు. అయితే బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కానీ, గత కొంత కాలంగా ఆయన బీజేపీతో లాభం లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరి రాజకీయాలలో కంటిన్యూ అయ్యే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగవచ్చుననే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం టీడీపీ, జనసేన కూటమితో బీజేపే కూడా జట్టుకడుతుందనే నమ్మకంతో ఉన్న ఆయన, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రెండురోజుల్ పర్యటనకు ఢిల్లీ వెళ్ళిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దేశం ఎంపీలతో కలిసి కృష్ణం రాజు కూడా స్వగతం పలికారు. అంటే కాదు ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో. నేరుగా ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగడానికి ఆసక్తిగా ఉన్నానని చంద్రబాబు నాయుడుకు చెప్పినట్లు తెలుస్తోంది.
నర్సాపురం లేదా మరే లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను అయినా తనకు కేటాయించాలనే ప్రతిపాదన పెట్టారనీ. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారనీ సమాచారం.అదలా ఉంటే , రఘురామ కృష్ణం రాజు అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన కుడా చేస్తున్నారని, అందుకే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు అవకాశాలు మెండుగా ఉన్న నేపధ్యంలో ఆయన ముందుగానే, తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని అయన సన్నిహితులు చెపుతున్నారు.