ఎఫ్ఐఆర్ లో అప్పటికిప్పుడు చేరిన చంద్రబాబు పేరు!

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం(సెప్టెంబర్ 8) అర్ధరాత్రి నుండి హైడ్రామా తర్వాత శనివారం (సెప్టెంబర్ 9)ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటలలోపు న్యాయస్థానం లేదా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలన్న నిబంధన మేరకు ఆదివారం(సెప్టెంబర్ 10) ఉదయం 5 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వద్దకు తండోపతండాలుగా తెలుగుదేశం అభిమానులు చేరుకోగా భారీగా పోలీసులు మోహరించారు. ఏసీబీ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో న్యాయవాదులు కూడా చేరుకున్నారు. సీఐడీ అరెస్ట్, కేసు పూర్వాపరాలు, అరెస్ట్ చేసిన తీరు, నమోదు చేసిన సెక్షన్లు, చట్టబద్దంగానే అరెస్ట్ చేసారా లేదా ఇలా పలు కోణాలలో కోర్టులో వాదనలు కొనసాగాయి.

 అయితే, చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. కొన్ని గంటల పాటు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కాగా, అరెస్ట్ అంశంలో ప్రధానంగా కొన్ని అంశాలు కోర్టుకు ఆగ్రహాన్ని తెప్పించాయి. పీసీ యాక్ట్ ప్రకారం వారం రోజులు ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు అరెస్టుపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు శిబిరం వద్దకు వచ్చిన సీఐడీ పోలీసులు అప్పటికప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అలాగే 2021లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైతే అప్పుడు ఇందులో చంద్రబాబు పేరు లేదు. గతంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోగా ఇప్పుడు తాజాగా ఆయన పేరు చేర్చి హడావిడిగా అరెస్ట్ చేసారు. అలాగే ఇప్పటికిప్పుడు రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరును చేర్చారు. అలాగే సెక్షన్ 17ఏ కింద అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. కానీ, సీఐడీ పోలీసులు చంద్రబాబు అరెస్టు కోసం గవర్నర్ అనుమతి కోరలేదు. దీంతో ఇవే ఇప్పుడు సీఐడీ కొంపముంచాయి.

చంద్రబాబు అరెస్టుపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరగగా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును ఇప్పటికిప్పుడు చేర్చడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీ, ఏఏజీకి ప్రశ్నలు సంధించారు. గతంలో ఎఫ్ఐఆర్ చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు పేరు ఎందుకు చేర్చారో చెప్పాలని నిలదీశారు. అలాగే సెక్షన్ 409 కింద అరెస్ట్ చేసినట్లు సీఐడీ పేర్కొనగా.. అందుకు ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయంపై తగిన ఆధారాలున్నాయా అని న్యాయమూర్తి ఏఏజీని ప్రశ్నించారు. లాజికల్ గా జడ్జి అడిగిన ప్రశ్నలకు సీఐడీ అధికారులు, ఏఏజీ సుధాకర్ రెడ్డి ఖంగుతిన్నారని తెలుస్తోంది. ఆ ప్రశ్నల తర్వాత పది నిమిషాల పాటు వాదనలకు న్యాయమూర్తి బ్రేక్ ఇచ్చేంతగా కోర్టులో వాదనలు జరిగాయి.

ఈ కేసు విచారణ సందర్భంగా ముందుగా న్యాయమూర్తి చంద్రబాబు నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలో తన వాదనలు తానే వినిపించుకుంటానని చంద్రబాబు కోరగా న్యాయమూర్తి  అంగీకరించారు. దీంతో తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కక్ష్ పూరిత పాలన జరుగుతుందని.. గతంలో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ ఇప్పుడు తన అక్రమ అరెస్టును చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట వినిపించారు.

రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సీబీఐ రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారని, తనపై కేసు నమోదు చేశారని, ఇది చట్ట విరుద్ధమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ఆనాటి కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వం 2015 బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని కూడా పొందుపరిచామని, అది అసెంబ్లీ ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అలాగే 2021లో నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులో తన పేరు, తన పాత్ర గురించి పేర్కొనలేదని చంద్రబాబు వివరించారు. వాదన విన్న న్యాయమూర్తి మీరు కోర్లు హాల్లోనే ఉంటారా అని చంద్రబాబును ప్రశ్నించగా.. వాదనలు పూర్తయ్యేవరకూ కోర్టులోనే ఉంటానని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. మొత్తంగా చంద్రబాబు వాంగ్మూలం, న్యాయవాదుల ప్రశ్నలకు సీఐడీ అధికారుల వద్ద సమాధానాలే కరువయ్యాయి.