ఆరున్నర గంటల పాటు సుదీర్ఘ వాదనలు!

తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్ లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి వెళ్లిన డీఐజీ రఘు రామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడ భయానక వాతావరణం సృష్టించారు. అర్ధరాత్రి చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న భస్సు తలుపులు బలంగా కొట్టి మరీ ఆయనను బయటకు రప్పించారు. చంద్రబాబును అరెస్ట్ చేయనున్నారని తెలుసుకున్న అక్కడే ఉన్న టీడీపీ నేతలు పోలీసులను అడుకునే ప్రయత్నం చేశారు. తనను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, తాను చేసిన తప్పేంటో చెప్పాలని చంద్రబాబు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెల్లవారు జాము వరకూ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు చంద్రబాబును కలిసి అరెస్టు చేశారు. 

నంద్యాల నుండి విజయవాడకు రోడ్డు మార్గం ద్వారానే చంద్రబాబును తరలించిన పోలీసులు.. ఆదివారం ఉదయం వరకూ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచలేదు. సాయంత్రం 5 గంటలకే ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చినా రాత్రంతా విచారణ పేరుతో వేధించారు. రాత్రి సమయంలో నిద్ర పోకుండా.. విశ్రాంతి తీసుకొనే వీలు లేకుండా చంద్రబాబును పోలీసులు వేధించారు. అయితే, అరెస్ట్ చేసిన 24 గంటలలోపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాల్సిన నిబంధనతో ఆదివారం ఉదయం ఆయన్ను ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు  సుదీర్ఘంగా సాగాయి.   మధ్యలో మూడు సార్లు విచారణకు బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత   విచారణ  ముగిసింది. సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగగా తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు .

కాగా, ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో కొన్ని కీలక అంశాలు హైలెట్ అయ్యాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలువినిపించగా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అసలు చంద్రబాబు పేరు కూడా ఎఫ్ఐఆర్ లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును చేర్చడంపై కోర్టులో సుదీర్ఘ వాదన జరిగింది. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాల్సి ఉండగా ఏసీబీ ఎందుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదించగా సెక్షన్ 409 కింద అభియోగాలు మోపి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.

రెండేళ్ల క్రితం విచారణ మొదలైన కేసులో ఏ ఆధారాలు సమర్పించక ముందే అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం, సీఐడీ పేర్కొన్నట్లుగా ఈ కేసులో చంద్రబాబు వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు ఆధారాలు ఉన్నాయా అనే అంశాలపై వాదనలు నడిచాయి. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని పేర్కొన్న లూథ్రా.. చంద్రబాబు అరెస్ట్ చేసిన పోలీసు అధికారుల ఫోన్ కాల్ రికార్డును కోర్టుకు సమర్పించాలన్నారు.  ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా కోర్టు రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ వివరించారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్ రిపోర్ట్ రాస్తారా అని లూథ్రా ప్రశ్నించారు. అలాగే 2021లో ఈ కేసు పెడితే ఇప్పటి వరకూ ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయలేదని కోర్టు ఏజీని ప్రశ్నించింది. అలాగే సెక్షన్ 409 కింద అరెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్‌లో పేరు ఉండాలని.. కనీసం వారం రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని.. కానీ ఇవేమీ లేకుండానే సీఐడీ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో చంద్రబాబును ఇరికిస్తున్నారని లూథ్రా కోర్టుకు తెలిపారు.

సెక్షన్ 17ఏ గురించి కోర్టుకు వివరించిన సిద్ధార్థ లూథ్రా.. సెక్షన్ 24, 8 ఆఫ్ పీసీ యాక్ట్ గురించి కూడా వివరించారు. ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ మంజూరైందని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కాగా దానిని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. అలాంటి ప్రభుత్వ చర్యలలో తనకు వ్యక్తిగతంగా లాభం ఉందని.. అందులో అసలు చంద్రబాబు పాత్ర ఉందని కానీ రెండేళ్లలో సీఐడీ ఎక్కడా పేర్కొనలేదు. అలాగే ఇప్పుడు అలాంటి ఆధారాలు కూడా లేవన్న దానిపై కోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి.