పెళ్లి రోజు ఇంతలో..
posted on Sep 10, 2023 6:03AM
స్కిల్ డవలప్‌మెంట్ స్కీంలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టాయి. అయితే నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మద్యాహ్నం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. భాదలు చెప్పుకునేందుకే దుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు. తన భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. తన భర్త ప్రజల కోసమే పోరాడుతున్నారని.. ఈ పోరాటంలో ఆయన సాధిస్తారని ఆకాంక్షించారు. చంద్రబాబు పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలకు నారా భువనేశ్వరి విజ్జప్తి చేశారు.
సెప్టెంబర్ 10వ తేదీ నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆదివారం వారు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవాలనుకొన్నారు. కానీ ఇంతలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం.. ఆయన్ని విజయవాడకు పోలీసులు తరలించడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నం దుర్గమ్మను దర్శించుకొన్నారు. ఆమె వెంట పార్టీ శ్రేణులు ఉన్నాయి.
ఓ వైపు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన విజయవాడకు బయలుదేరారు. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 200 రోజులు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా మంగళగిరిలో లోకేశ్‌ను ఆయన తల్లి భువనేశ్వరి కలిశారు. మరోవైపు చంద్రబాబునాయుడు.. బాబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ.. పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం నంద్యాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన నంద్యాలలోనే విశ్రాంతి తీసుకొంటు ఉండగా శనివారం ఉదయం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.