వారికోసం వీళ్లేందుకు బలవ్వాలి?
posted on Aug 10, 2015 12:10PM
పరిస్థితులు ఎలాంటివైనా ఆఖరికి ఆ పరిస్థితులకు సామాన్య ప్రజలే బలవ్వుతున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాల్లో ప్రవేశించి.. ప్రజలకు మంచి పనులు చేసినా చేయకపోయినా పదవులు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు ఎంతో దర్జాగా కాలం గడుపుతుంటే వారి రాజకీయాలకు యువకులు బలవ్వడం బాధాకరమైన విషయం. నాడు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్ర వచ్చిందంటే దానికి కారణం ఎంతో మంది యువకులు పోరాట పటిమనే కారణం. అసలు ఆ యువత లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి అసలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించే వారు కాదేమో.. ప్రత్యేక రాష్ట్రం వచ్చుండేది కాదేమో. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు తమ ప్రాణాలు బలిదానాలు చేశారు. కానీ అమరవీరులు అన్న పేరు తప్ప వారికి ఇంకే లభించింది.. కనీసం వారి కుటుంబాలను సరిగా ఆదుకునే సమయం కూడా నేతలకు లేకుండా పోయింది.
ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రాణ త్యాగాలు మొదలయ్యాయి. కేంద్రం ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. కానీ మునికోటి ఆత్మహత్యాయత్నంతో అది తారాస్థాయికి చేరింది. తన ఆత్మహత్యతో ఉద్యమానికి ఆహుతైన మొదటి ప్రమిదగా మారాడు. పదేళ్ల హయాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ.. తమ పార్టీ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించింది. అప్పట్లో బీజేపీ కూడా పదేళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పింది. కాలంతో పాటు మాటలు కూడా మారిపోతాయన్నట్టు అప్పుడు ఇస్తామని చెప్పినా ప్రభుత్వమే ఇప్పుడు ఇవ్వనని.. తేల్చిచెప్పేయడం.. మరోవైపు రాష్ట్రాన్ని విడదీసిన పాపం పొగట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొసలి కన్నీరు కార్చడం.. ఇవన్నీ రాజకీయాల్లోనే సాధ్యం. వారు చేసే దొంగ రాజకీయాలకు సామాన్య ప్రజలు బలవ్వడం ఎంత వరకూ సమంజసమో వారే ఆలోచించుకోవాలి. అధికారంలోకి రావడానికి ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చే నేతలకు అధికారంలోకి వచ్చిన తరువాత కాని ఆ హామీలు నేరవేర్చడం అసాధ్యమని తెలియదుకాబోలు.
మొత్తానికి ఏదేమైనా అందరూ బానే ఉన్నా రాజకీయ నాటకాలలో యువకులు బలవ్వడం మాత్రం దురదృష్టకరమైన అంశం. అసలు వారికోసం వీళ్లేందుకు బలవ్వాలి.. యువత ఎందుకు ప్రాణాలు అర్పించాలి. ఇప్పుటికైనా ముని కోటి మరణంతో మన నేతలు కళ్లు తెరిచి నాటకాలాడకుండా నిజాయితీగా పోరాడితే ప్రత్యేక హోదా సాధించవచ్చు. ఇంకా ముందుముందు జరగబోయే దారుణాలను అడ్డుకోవచ్చు.